18 August, 2026 | 6:47 PM

సర్వాయి పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

18-08-2026 05:55 PM

ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో తెలంగాణ వీరుడు, బహుజన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్నమోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి విశ్వనాథం గౌడ్, ఆలేరు మండల అధ్యక్షుడు పోతుగంటి సంపత్ కుమార్ గౌడ్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బైరి విశ్వనాథం గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ‘తెలంగాణ శివాజీ’గా పేరుగాంచిన సర్వాయి పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న చరిత్రను యువతకు తెలియజేసి, ఆయన చూపిన పోరాట స్ఫూర్తిని సమాజంలో కొనసాగించాలని కోరారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.