18 August, 2026 | 6:26 PM

సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాల కోరు

18-08-2026 05:32 PM

కెసిఆర్ కుటుంబాన్ని తిట్టడమే రేవంత్ రెడ్డి పని

అధికారంలోకి రావడానికి 450 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు

కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసే పనిలో రేవంత్ బిజీ.. బిజీ

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను రద్దు చేస్తే ఊరుకునేది లేదు

పార్టీ శ్రేణులతో ఆర్డీవో కార్యాలయానికి  భారీ ర్యాలీ, ఆర్డిఓకు వినతిపత్రం అందజేత

ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

బాన్సువాడ,(విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలకోరు అని అధికారంలోకి రావడానికి 450 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై కోర్టు స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వమే పథకాలను రద్దు చేస్తున్నారని నిరసిస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి రద్దు చేసే యోచనలో రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారనీ, రద్దు చేసేందుకు  కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.కేసీఆర్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, ఆసరా పింఛన్లు వంటి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రూ.2 వేలకు పెంచుతామన్న ఆసరా పింఛన్లు ఇప్పటికీ ఇవ్వలేదని, రూ.4 వేల పింఛన్ హామీ కూడా కాగితాలకే పరిమితమైందని విమర్శించారు.

కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కంటివెలుగు వంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, 15 వేల రైతుబంధు అమలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దళితులు, బీసీలు, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడొద్దని బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డితో చేతులు కలిపి కాంగ్రెస్లో చేరారని, ప్రస్తుతం మళ్లీ కేసీఆర్ ను పొగుడుతున్నారని విమర్శించారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం సరికాదన్నారు. ఆయన మాటలు ప్రజలు వినే పరిస్థితిలో లేరని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్ని రేవంత్ రెడ్డి బందు చేస్తారని, సంక్షేమ పథకాల కోసం టీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూరు మండలాల్లో కలిపి మొత్తం 896 మందికి తులం బంగారం ఇవ్వాల్సి ఉందని, 500 దరఖాస్తులు  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని బాజిరెడ్డి తెలిపారు.

రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 896 తులాల బంగారం అంటే సుమారు 15 కోట్ల రూపాయల బంగారాన్ని ప్రభుత్వం బకాయి పెట్టిందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని, ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసి నిరుపేదలకు అందే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం,లక్ష రూపాయల నిధులు ఇస్తానని చెప్పిన రికార్డింగ్ లను ప్రజలకు మైక్ ద్వారా బాజిరెడ్డి వినిపించారు. బాన్సువాడ నియోజకవర్గంలో వరి పంట అధికంగా పండుతుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకుండా చేతులెత్తేస్తోందని ఆరోపించారు.

చివరకు రైతులు దళారులకే అమ్మకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ ప్రైవేటు వ్యక్తులు రైతుల పంట కొనకుండా కట్టడి చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, లేకుంటే మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, నియోజకవర్గ పరిశీలకుడు తోట ఆగయ్య, యువ నేత మోరల్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కొర్రి పెట్టి నిరుపేదలకు అన్యాయం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిరుపేదలకు అండగా ఉంటుందని, కార్యకర్తలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

సమావేశనంతరం సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో రవీందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు దుద్దాల అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్, షేక్ జుబేర్, కోటగిరి రవి, షేక్ అక్బర్, బాడీ శ్రీనివాస్, మోచి గణేష్ సాయిబాబా ఇసాక్, ఫిరోజ్, ఖలీల్, సర్పంచులు ధర్మతేజ మాధవరెడ్డి రమేష్ యాదవ్, నరసింహ గౌడ్ విట్టల్ సద్దాం దాస్ శ్రీనివాస్ జాదవ్ తో పాటు కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.