18 August, 2026 | 6:12 PM

అత్యంత వైభవంగా, కన్నులపండువగా శ్రీరంగనాయకస్వామి రథోత్సవం

18-08-2026 05:40 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ లో సోమవారం  రాత్రి శ్రీగోదాసమేత శ్రీమన్నారు. రంగనాయకస్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా కన్నులపండువగా జరిగింది. స్వామి వారి రథోత్సవంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి రథోత్సవాన్ని ప్రారంభించారు.

ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే మల్లారెడ్డి రావడంతో గ్రామస్థులు డప్పు వాయిధ్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలోకి ఆలయ ధర్మకర్తలు పోశెట్టి లక్ష్మణాచార్యులు, పురుషోత్తమాచార్యులు, గోవిందరాజులు, శేషాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి నిత్యజీవిత కార్యక్రమాలతో పాటు దైవకార్యక్రమాలలో కూడా పాల్గొనాలని అన్నారు. రంగనాయక స్వామి పట్ల ప్రజలల్లో ప్రగాఢ నమ్మకం, విశ్వాసం ఉన్నదని, స్వామి వారి కరుణాకటాక్షాలతో ప్రజలు నిరంతరం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు  తెలిపారు.