కౌకూర్ మోడల్ మార్కెట్ భవనం కోసం నాలుగో రోజు ధర్నా
మోడల్ మార్కెట్ ప్రజల కోసం – ఎక్సైజ్ కార్యాలయం కోసం కాదు!
కౌకూర్ ప్రజల కోసం ఎంఎంసీ వార్డు కార్యాలయం ఏర్పాటు చేయాలి
అల్వాల్, ఆగస్టు 30,(విజయక్రాంతి): కౌకూర్ లో ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి చేసిన కేటాయింపును వెంటనే రద్దు చేసి, కౌకూర్ ప్రజల కోసం ఎంఎంసీ వార్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత తుడిమెళ్ల మల్లికార్జున్ డిమాండ్ చేశారు. కౌకూర్ మోడల్ మార్కెట్ భవనాన్ని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ దీనిని ప్రజా అవసరాల కోసం వినియో గించాలని డిమాండ్ చేస్తూ నాలుగో రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
తుడిమెళ్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు, పలు కాలనీల సభ్యులు, మహిళా సంఘాల ప్రతి నిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ నిరసనను వ్యక్తం చేశారు. మోడల్ మార్కెట్ భవనంలో ఎంఎంసీ వార్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, మహిళలు, యువత ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండేలా ఈ భవనాన్ని పూర్తిగా ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని ఆయన కోరారు.
ప్రజా ప్రయోజనాల కోసం ఈ భవనాన్ని వినియోగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీ. వేణు గౌడ్, ఆసిఫుల్లా ఖాన్, శివరాజ్, కృష్ణ, శ్రీకాంత్, చందు, బలవంత్, హరీష్, ఆరిఫ్ ఖాన్, జలీల్, సాదిక్, పుష్ప, మంజుల, సంధ్య, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.






