31 August, 2026 | 11:14 AM

గద్వాల మార్కెట్ యార్డులో గంజాయి పట్టివేత..!

31-08-2026 10:00 AM

5కిలోల గంజాయి స్వాధీనం.. పలువురు పోలీసుల అదుపులో..?

గద్వాల, ఆగస్టు 30: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు ప్రాంతంలో గంజాయి పట్టుబడిన ఘటన కలకలం రేపింది. సుమారు 5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఇటిక్యాల మండలం శెనిగపల్లి గ్రామానికి చెందిన వారిగా ప్రాథమిక సమాచారం. గంజాయి స్వాధీనం కావడంతో గద్వాల పట్టణంలో గంజాయి అక్రమ విక్రయాలు, సరఫరాపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వ్యాపారం జరుగుతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పట్టణంలోని అనుమానాస్పద ప్రాంతాలు, మత్తు పదార్థాల విక్రయాలకు కేంద్రాలుగా మారే అవకాశమున్న ప్రాంతాలపై పోలీసులు మరింత నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు కఠినంగా అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్‌లో సమస్య మరింత విస్తరించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గంజాయి రహిత గద్వాల కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై గద్వాల టౌన్ ఎస్సైని వివరణ కోరగా, గంజాయి లభ్యమైనట్లు ధృవీకరిస్తూ, దీనికి సంబంధించి కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విచారణ పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.