జానపద కళలకు ప్రభుత్వం చేయూత
భూపాలపల్లి/ రేగొండ, ఆగస్టు 26 (విజయ క్రాంతి): జానపద కళలకు ప్రభుత్వం చేయూతనిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. రేగొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జానపద కళలు పల్లెల్లోని సమస్యలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆనందం, చైతన్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. జానపద, సాంస్కృతిక కళాకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నిరుపేద జానపద కళాకారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కళాకారులకు అందేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కళాకారుల పట్ల ఎంతో గౌరవం, ప్రేమ ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కళాకారులకు అవసరమైన రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






