అయోధ్య రామాలయ విరాళాలపై నిరసన
గాంధీ భవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్, ఆగస్టు 1(విజయక్రాంతి): గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్), పీసీసీ ఫిషర్‌మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయ విరాళాల అంశంపై శనివారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయోధ్య రామాలయానికి భక్తులు విశ్వాసంతో సమర్పించిన విరాళాల వినియోగంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతూ, ఆ నిధుల నిర్వహణలో పారదర్శకత ఉండాలనే డిమాండ్ చేశారు.
భక్తుల సెంటిమెంట్‌కు సంబంధించిన ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన నాటికను ప్రదర్శించారు. విరాళాలు ఎలా సేకరించబడుతున్నాయి, వాటి వినియోగంపై ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనే అంశాలను నాటకం ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు, దేవాలయాలకు భక్తులు సమర్పించే ప్రతి రూపాయి పవిత్రమైనదని, అలాంటి నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని కాపాడేలా సంబంధిత అధికారులు స్పష్టమైన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు.






