ప్రైవేట్ స్కూళ్లకు రక్షణ కల్పించాలి!
తెలంగాణ రికగ్నైజ్‌డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): పలు విద్యార్థి, కుల సంఘాల బారిన నుంచి ప్రైవేట్ స్కూళ్లకు రక్షణ కల్పించాలని, విద్యార్థి, కుల సంఘాల పేర్లతో పలువురు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలంగాణ రికగ్నైజ్‌డ్ స్కూ ల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్.రెడ్డి, జనరల్ సెక్రటరీ కె.అనిల్‌కుమార్ పేర్కొన్నారు.
ప్రైవేట్ స్కూళ్ల ను బ్లాక్ మెయిల్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయా సంఘాలకు వారు హెచ్చరించా రు. మంగళవారం నాంపల్లిలోని కమలా నెహ్రూ పాలిటెక్ని క్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... తక్కువ ఫీజులను వసూలు చేస్తూ తాము దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలు నిర్వర్తిస్తున్నామని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది వివిధ రకాల విద్యార్థి సంఘాలు, కుల సంఘాల పేర్లతో బ్లాక్ మెయి ల్ చేస్తూ నిధులు వసూలు చేస్తున్నారని, ఇవ్వకుంటే దాడులకు కూడా వెనుకాడటంలేదని ఆరోపించారు.
ఆయా సంఘాలపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్‌లను ఇటీవల కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల ప్రైవేట్ పాఠశాలలను తాము నిర్వహిస్తున్నామని, అందులో 35 లక్షల మంది విద్యార్థులకు విద్యనందిస్తున్నామని, ఐదు లక్షల మంది టీచింగ్ సిబ్బందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
33 జిల్లాల డీఈవో, ఎంఈవోలను కూడా ఆయా విద్యార్థి, కుల సంఘాలు బెదిరింపుల కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో ట్రస్మా ట్రెజరర్ కె.శ్రీకాంత్‌రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ రామేశ్వర్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ హనుమంత్‌రెడ్డి పాల్గొన్నారు.






