18 May, 2026 | 2:48 AM

ఉద్యమకారుల గుర్తింపునకు ప్రతిపాదనలు

18-05-2026 12:45 AM
  1. చనిపోయిన వారికి మొదటి ప్రాధాన్యం 
  2. తెలంగాణ ఉద్యమకారుల కమిటీ తొలి సమావేశంలో నిర్ణయం 

హైదరాబాద్, మే 17 (విజయ క్రాంతి):  తెలంగాణ ఉద్యమకారుల కమిటీ తొలి సమావేశం ఆదివారం కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, మోతె శోభన్‌రెడ్డి పాల్గొన్నారు. ఉద్యమకారులను గుర్తించేందుకు నాలుగు ప్రతిపాదనలను సిద్ధం శారు.

ఈ ప్రతిపాదనలపై తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, 1969,1972,1996 నాటి ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, కళాకారుల జేఏసీ, సబ్బండ వర్గాల జెఏసీ, కుల సంఘాలు, న్యాయవాదుల జేఏసీ, వివిధ జిల్లాల్లో ఏర్పడిన ఉద్యమ సంఘాలతో పాటు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని, ఇందుకోసం జిల్లా పర్యటనలు చేయాలని నిర్ణయించారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో కొందరికి మాత్రమే సహాయం అందించారని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని, పార్టీలకు అతీతంగా ఉద్యమకారుల ఎంపిక జరుగుతుందన్నారు. అదే విధంగా  అమరవీరుల జ్యోతి కింద ఉన్న ఆఫీస్‌లో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేయాలని సమావేశంలో  సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.   

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభుత్వం తరఫున అధికారికంగా కమిటీ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కమిటీ ధన్యవాదాలు తెలిపింది. కమిటీ ప్రతిపాదించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ నుండి రాగానే ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

 నాలుగు రకాల ప్రతిపాదనలు ఇవీ..

తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారికి మొదటి ప్రాధాన్యమివ్వాలి. 

గాయపడిన వారిని రెండవ కేటగిరీగా తీసుకోవాలి.   

జైలుకు వెళ్లిన వారిని, అరెస్టు అయిన వారిని, కేసులు నమోదైన వారిని మూడవ కేటగిరీగా తీసుకోవాలి.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉద్యమంలో పాల్గొన్న వారిని నాలుగో కేటగిరీగా ప్రతిపాదించారు. నాలుగో కేటగిరీ వారు ఉద్యమంలో పాల్గొన్న పేపర్ కటింగ్స్ చూపాలని నిర్ణయించారు.