18 May, 2026 | 1:46 AM

మద్యం పన్నుపోటుపై ఐటీరైడ్

18-05-2026 12:48 AM
  1. టాక్స్ ఎగవేస్తున్న వైన్‌షాపులు, బార్లు, పబ్‌లపై ప్రత్యేక నిఘా
  2. ఇప్పటికే షాపుల యజమానుల ఇళ్లపై దాడులు
  3. మరికొందరి జాబితా సిద్ధం చేసిన ఐటీశాఖ
  4. బేవరరేజెస్ వ్యవస్థలోని లోపాలపైనా ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): మద్యం పన్నుపోటు పొడుస్తున్న వైన్‌షాపులు, బార్లు, పబ్‌లపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పలువురు యజమానులు ఆదాయాన్ని తక్కువగా చూపించి ట్యాక్స్ ఎగవేతకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఐటీ శాఖ దాడులు చేస్తోంది. మరికొందరి జాబితాను కూడా తయారు చేసినట్లు, త్వరలోనే రైడ్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బేవరరేజెస్ వ్యవస్థలోని లోపాలపై కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం.

ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి పరిధిలో ప్రభుత్వానికి మద్యం పన్ను ఎగవేస్తున్న కొన్ని వైన్‌షాపులు, బార్లు, వాటి యజమానుల నివాసాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొందరి జాబితాను కూడా సిద్ధం చేసినట్లుగా సమాచారం. త్వరలోనే ఐటీశాఖ, ఏసీబీ కూడా దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టెండర్లలో వైన్‌షాపులు దక్కించుకున్న యజమానులు.. ఆ తర్వాత వేరే వారికి షాపులను లీజుకు ఇచ్చి నడిపిస్తున్నట్లుగా ఐటీ శాఖ గుర్తించింది.

ఈ లీజ్‌కు సంబంధించిన అంశం ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండానే జరుగుతోందని స్పష్టం చేసింది. వైన్‌షాపులను టెండర్లలో దక్కించుకున్న వారు..ఆ తర్వాత రూ.కోట్లలోనే లీజుకు ఇవ్వడం, లీజుకు తీసుకున్న వ్యక్తులు సర్కార్‌కు పన్నులు చెల్లించడంలో మాయాజాలం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా మద్యం డిపోల నుంచి వైన్‌షాపు యజమానులు ఎంత మేర మద్యం, బీర్లు   కొనుగోలు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఎంత వరకు మద్యం కొనుగోలు చేసి విక్రయిస్తున్నారనే అంశాలపైన ఐటీ శాఖ వివరాలను సేకరించి నిఘా పెట్టినట్లుగా సమాచారం.

కొందరు బడా వ్యాపారులు ఆయా వర్గాల వారి పేర్లతో వైన్‌షాపులు దక్కించుకుని, ఐటీ చెల్లించకుండా సర్కార్ ఖజానకు గండికొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చాలామంది వ్యాపారులు మద్యం కొనుగోళ్లు, విక్రయాలు సమయాల్లో వచ్చే డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు రూపంలో వచ్చే ఆదాయం రూ.కోట్లలో తక్కువగా చూపిస్తున్నట్లుగా ఐటీ శాఖ గుర్తించింది. ఐటీ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీని ప్రభుత్వం అప్రమత్తం చేసినట్లుగా సమాచారం.

అయితే వైన్‌షాపులు టెండర్లు జరిగినప్పుడు లైసెన్స్ పొందిన యజనమానుల పేర్లు, వివరాలన్నీ టీఎస్‌బీసీఎల్ ( తెలంగాణ స్టే బేవరరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) వద్ద ఉంటాయి. వైన్‌షాపులకు సంబంధించి లైసెన్స్ పొందిన తర్వాత.. కొందరు యజమానులు ఇతరులకు లీజ్‌కు ఇవ్వడం జరుగుతోంది. లైసెన్స్ పొందిన వారి నుంచి ఇతరులకు చేతులు మారాక, వారి వివరాలను రికార్డు చేయడంలో టీఎస్‌బీసీఎల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

దీంతో చేతులు మారిన షాపుల ఆదాయంపై నిఘా కొరవడిందని ఐటీ శాఖ గుర్తించినట్లు తెలిసింది. అయితే కొందరు  వైన్‌షాపుల యజమానులు, టీఎస్‌బీసీఎల్‌లో పనిచేసే కొంతమంది అధికారులతో కుమ్మక్కై ఫోన్ నెంబర్, ఆధార్ వివరాలను ఇవ్వకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు గుర్తించిన ఐటీ శాఖ, ఈ వ్యవస్థలోని లోపాలపై ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్లు సమాచారం.