10 March, 2026 | 9:59 PM

దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

09-03-2026 08:05 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్‌కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి కేటాయించాలని కోరారు.

జివో నంబర్ 58, 59 ప్రకారం అసైండ్ భూములకు పట్టాలు ఇచ్చి వాటిని కొనుగోలు, విక్రయాలకు హక్కులు కల్పించాలని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఉచిత విద్యను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ శాఖకు రూ.15 వేల కోట్లు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో వైకుంఠ ధామాలు, కబ్రస్తాన్‌ల పేరుతో దళితుల నుంచి తీసుకున్న అసైండ్ భూములను తిరిగి వారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే పారిశుధ్య కార్మికులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలని కోరారు. తోళ్ళ పరిశ్రమల శాఖకు రూ.10 వేల కోట్లు కేటాయించి లిడ్ క్యాప్ భూములను పరిరక్షిస్తూ తోళ్ళ పరిశ్రమలు ఏర్పాటు చేసి మాదిగ యువతకు ఉపాధి కల్పించాలని తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆదేశాల మేరకు ఈ వినతి పత్రం సమర్పించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొమ్మన ధర్మయ్య, రాష్ట్ర కార్యదర్శి శనిగరపు మల్లేష్ మాదిగ, మండల అధ్యక్షులు అశోక్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.