22 April, 2026 | 6:24 PM

ఉత్తమ విద్య.. సకల సౌకర్యాలు

22-04-2026 05:01 PM

- సర్కారు బడుల్లోనే బడిఈడు పిల్లలను చేర్పించాలంటూ కొంపెల్లి గ్రామంలో విస్తృత ప్రచారం

- గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాఠశాల ఉపాధ్యాయులు

మునుగోడు,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువమంది విద్యార్థులను చేర్పించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం మండలంలోని కొంపల్లి గ్రామంలో ప్రారంభించి,పాఠశాలల పరిసర ప్రాంతాల్లోని కాలనీలు, వెళ్లి  పిల్లలున్నా, చదువు మానేసిన వారిని సర్కారు బడుల్లో చేర్పించాలంటూ తల్లిదండ్రులను గ్రామ సర్పంచ్ నిర్మల దశరథ, వేదిరే విజయేందర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు కోరారు. ప్రతి విద్యార్థికి మంచి చదువు, ఏకరూప దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వివరించారు.

కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉత్తీర్ణత సాధించారని,ప్రైవేటు, కార్పొరేటుకు దీటుగా.. ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధిస్తున్నారని అన్నారు. సర్కారు బడుల్లో సౌకర్యాలుండవ్.. తరగతుల్లో ఉపాధ్యాయులు సక్రమంగా బోధించరన్న అపోహతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం లేదని అధికా రులు గుర్తించారు. ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడులున్నాయని తల్లిదండ్రులకు వివరించేందుకు విశాలమైన తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, మధ్యాహ్న భోజనశాలలు, కంప్యూటర్ ల్యాబ్ల ఫొటోలను విద్యార్థుల తల్లిదండ్రులకు చూపిస్తున్నారు. ప్రవేశాలు పెంచడమే లక్ష్యం.. ప్రభుత్వం అంశాలను సమీక్షించిన ప్రతిసారీ ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలను పోల్చుతున్నారు.

సర్కారు పాఠశాలల్లో మెరుగైన వసతులున్నా విద్యార్థులను తల్లిదండ్రులు ప్రైవేటు బడుల్లోనే చేర్పించేందుకు ఇష్టపడుతున్నారని, ఈ లోపాన్ని సరిదిద్దాలని అధికారులకు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా  విద్యార్థులు వచ్చేలా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని, మండల విద్యాశాఖ అధికారులు వారితో కలిసి పనిచేయాలని సూచించారు. అనంతరం సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఆధ్వర్యంలో కొంపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం సమక్షంలో ఉన్నత పాఠశాలలో  "ఆడ పిల్లలను రక్షించండి, ఆడ పిల్లలను చదివించండి" అనే అంశంపై కిశోర బాలికలకు వ్యాస రచన పోటీ నిర్వహించి పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. పోటీ ఫలితాల్లో సూర అశ్విత మొదటి బహుమతి, దాము చైత్ర రెండవ బహుమతి, సూర వర్షిత మూడవ బహుమతి సాధించారు.