9 May, 2026 | 12:20 PM

వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగించాలి

09-05-2026 11:31 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి):  రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ గోపాల్‌పేట మండలంలోని నర్సింగాయిపల్లి గ్రామంలో ఉన్న మెప్మా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి, రికార్డులు మరియు ధాన్యం నమోదు రిజిస్టర్లను తనిఖీ చేశారు. రైతులకు కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.  

అలాగే ధాన్యం తూకం, తరలింపు, చెల్లింపుల ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని  ఇన్‌చార్జీలకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యంలో తాలు, గడ్డి లేకుండా క్లీన్ చేసుకునే విధంగా రైతులకు తెలియజేయాలని సూచించారు. ప్యాడి క్లీనర్లను వినియోగించి ధాన్యాన్ని తాలు లేకుండా క్లీన్ చేయాలని రైతులకు తెలియజేశారు. అకాల వర్షాలు సంభవిస్తే రైతులకు ఇబ్బంది కలగకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు దాన్యం తెచ్చిన వారికి తెచ్చినట్లుగా తూకం చేసి కేటాయించిన మిల్లుకు తరలించాలని సూచించారు.  రైతులకు మెరుగైన సేవలు అందేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాథ్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.