9 August, 2026 | 2:25 AM

ఆ ఆస్కార్ విజేతతో ప్రియాంక రహస్య మిషన్!

09-08-2026 01:18 AM

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన నటనతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జోనాస్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్ట్ చేరింది. ‘గ్లాడియేటర్’ చిత్రంతో ఆస్కార్ అవార్డు అందుకున్న హాలీవుడ్ దిగ్గజ నటుడు రస్సెల్ క్రోతో కలిసి ఆమె సరికొత్త సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించబోతోంది. ఈ చిత్రానికి ‘బ్లూఫ్లై’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రియాంక చోప్రా స్వయంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించి అందరి దృష్టిని ఆకర్షించింది.

దీనికి ‘ఆన్ టు ద నెక్స్’ అంటూ ఒక పవర్‌ఫుల్ క్యాప్షన్ పెట్టింది. చిత్రబృందం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సినిమా కథ ఆఫ్రికాలోని కాంగో దేశంలోని ప్రమాదకరమైన, దట్టమైన అడవుల నేపథ్యంలో సాగుతుంది. ఐక్యరాజ్య సమితిలో పనిచేసే ఒక అనువాదకురాలు (యూఎన్ ట్రాన్స్‌లేటర్) ఊహించని పరిస్థితుల్లో ఒక అత్యంత రహస్యమైన ‘బ్లాక్ ఆప్స్ మిషన్’ (రహస్య సైనిక ఆపరేషన్)లోకి అడుగుపెడుతుంది. కాంగో అడవుల్లో కూలిపోయిన, అసలు రికార్డుల్లోనే లేని ఒక విచిత్రమైన, వింత విమానాన్ని కనుగొని, దానిని స్వాధీనం చేసుకోవడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. అయితే, ఆ ప్రమాదకరమైన ప్రాంతంలో సాయుధ బలగాలను ఎదుర్కొంటూ మిషన్ ముందుకు సాగుతున్న కొద్దీ ఊహించని భయంకరమైన నిజాలు బయటపడతాయి.

ప్రాణాల కోసం సాగించే ఈ ఉత్కంఠభరిత పోరాటంలో ప్రియాంక చోప్రా పాత్ర ఎంతో కీలకంగానూ, నరాలు తెగే ఉత్కంఠతోనూ ఉండబోతోందని సమాచారం. ‘ప్రెడేటర్స్’ వంటి విలక్షణమైన హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు నిమ్రోడ్ అంటాల్ దర్శకత్వం వహించనున్నారు. డేవిడ్ ఫ్రిగేరియో, విలియం యూబ్యాంక్, కార్లైల్ యూబ్యాంక్ సంయుక్తంగా స్క్రీన్‌ప్లే అందించారు. మైఖేల్ జెఫర్సన్, డేవిడ్ ఫ్రిగేరియో, హైలాండ్ ఫిల్మ్ గ్రూప్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. 

రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది. దీనికి ముందే, ప్రపంచవ్యాప్తంగా సినిమా బిజినెస్ హక్కుల అమ్మకాలను ప్రతిష్టాత్మక ‘టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ (టీఐఎఫ్‌ఎఫ్) మార్కెట్లో ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో ఇప్పటికే ‘ది బ్లఫ్’, ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ వంటి చిత్రాలతో బిజీగా ఉండటమే కాకుండా, తెలుగులో  ‘వారణాసి’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు రస్సెల్ క్రోతో ‘బ్లూఫ్లై’ ప్రకటించడం విశేషం.