ఆస్కార్ వేడుక ప్రెజెంటర్‌గా..
ప్రియాంక చోప్రా మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచ సినీరంగంలోనే అత్యున్నత పురస్కార వేడుకగా భావించే ఉత్సవం ‘ఆస్కార్ 2026’ అకాడమీ అవార్డ్స్. ఈ వేడుకలకు ప్రెజెంటర్‌గా ఎంపికైంది ప్రియాంక చోప్రా.
మార్చి 15న జరగనున్న ఆస్కార్ వేడుకల్లో హాలీవుడ్ ప్రముఖులతో కలిసి ప్రియాంక.. ఒక విజేతకు అవార్డు అందించనున్నారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న అతికొద్ది మంది భారతీయ నటీమణుల్లో ప్రియాంక అగ్రస్థానంలో నిలవడం విశేషం. అంతర్జాతీయ వేదికలపై భారతీయ జెండాను రెపరెపలాడిస్తున్న దేశీ గర్ల్ ప్రియాంక.. కేవలం నటిగానే కాకుండా, గ్లోబల్ ఐకాన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. గతంలోనూ ఆస్కార్ వేదికపై అవార్డును ప్రదానం చేసిన అనుభవం ఆమెకుంది.
ఇటీవల ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా మెరిసిన ప్రియాంక తాజాగా ఆస్కార్ వేడుకలకూ ఎంపిక కావటం ఆమె గ్లోబల్ ఇమేజ్‌కు నిదర్శనమని చెప్పొచ్చు. హాలీవుడ్ దిగ్గజాల మధ్య ఒక భారతీయ నటి వరుసగా ఇలాంటి ప్రతిష్టాత్మక బాధ్యతలు చేపట్టడం విశేషం. ఈ వార్త తెలియగానే ‘ప్రియాంక చోప్రా అంటే నటి మాత్రమే కాదు.. ఇండియా గర్వించదగ్గ గ్లోబల్ బ్రాండ్’ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. హాలీవుడ్‌లో క్వాంటికో సిరీస్ నుంచి మొదలైన ప్రియాంక ప్రయాణం.. ఇప్పుడు ఆస్కార్ వేదికపై శాశ్వత సభ్యురాలిగా, ప్రెజెంటర్ ఎదగడం నిజంగా స్ఫూర్తిదాయకమని పేర్కొంటున్నారు నెటిజన్లు.




