13 April, 2026 | 4:50 AM

మక్క కొనుగోళ్లలో ప్రైవేట్ దందా!

13-04-2026 02:58 AM
  1. మార్కెఫెడ్ మీనమేషాలు
  2. క్వింటాకు మద్దతు ధర రూ.2,400 

రూ.1,700 నుంచి రూ. 1,800 వరకే కటాఫ్ అంటున్న ప్రైవేట్ వ్యాపారులు

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ  వస్తాయని ఆశపడ్డ మక్క రైతులకు నిరాశే మిగులుతోంది. ఆరుతడి పంటలతో.. ఆశించిన మేర ఆదాయం వస్తుం దని నమ్మిన మక్క  రైతులకు అన్యాయమే జరుగుతున్నది. పత్తి, మిరప పంటలకు తెగుళ్లు రావడంతో రైతులు  ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను సాగుచేశారు. ఈ ఏడాది రబీలో గతంలో ఎన్నడూలేని విధంగా 8.41 లక్షలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయ గా, 23.31 లక్షల టన్నుల దిగుబడివస్తుందని  అంచనా వేశారు.

ఇందులో మార్కెట్‌కు 9 లక్షల టన్నులకు పైగా వచ్చే అవకాశం ఉండగా, కనీసం 3 లక్షల టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుచేయాలని నిర్ణయించారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్లు వరకు దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఈ మక్కలను మార్క్‌ఫెడ్ ద్వారా ఎకరాకు 25 క్వింటాళ చొప్పున కొనుగోలుచేయాలని, అందుకు మద్దతు ధరను క్వింటాకు రూ. 2400 ప్రభుత్వం నిర్ణయించింది.

సాగు విస్తీర్ణాన్నిబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో  341 మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నది. అయితే ఇప్పటివరకు కనీసం 50 కొనుగోలు సెంటర్లు కూడా ఏర్పాటుచేయడం లేదని అధికార వర్గాల చెబుతున్నాయి. దీంతో  ప్రైవేట్ వ్యాపారులు కారుచౌకగా కొనుగోలుచేస్తూ, రైతుల ను నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,400 ఉండగా, ప్రైవేట్ వ్యాపా రులు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా రూ.1,700 నుంచి రూ. 1,800 వరకే కొనుగోలు చేస్తున్నారు.

పెట్టుబడి ఖర్చులు రావడం లేదు.. 

మక్క విత్తనం పెట్టిన నాటినుంచి కోతకు వచ్చేవరకు ఎకరాకు రూ. 50 నుంచి రూ. 60 వేల వరకు ఖర్చు వస్తుంది. ఇప్పుడు అదనంగా ఎరువుల ధరలు పెరగడం, ఈ కూలీ రేట్లు పెరగడం వల్ల ఒక్కో రైతుకు ఎకరా కు రూ.5 వేల వరకు అదనపు భారంపడుతోందని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో  మక్కల  కొనుగోలుకు మార్క్‌ఫెడ్ పూర్తిస్థాయిలో ముం దుకురాకపోవడం వల్లే రైతులుపై అప్పుల భారం పడే  పరిస్థితి దాపురించిందని విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ వ్యాపారుల వల్ల మక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని,

ప్రభుత్వం తరపున మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.  రాష్ట్రంలోని అక్కడక్కడ కొన్ని జిల్లాలలో మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా.. పూర్తిస్థాయిలో ప్రారంభం చేయకపోవడంతో మక్క  రైతులు ప్రైవేటు వ్యాపారస్తులను ఆశ్ర యించక తప్పడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలలో.. 

మక్కలు ఎక్కువగా ఉమ్మడి మెదక్,  కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌తో పాటు మిగతా జిల్లా లలోనూ లక్షల ఎకరాల్లో మక్కలను పండిస్తున్నారు. ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మక్కల సాగు గణనీయంగా పెరిగింది. ఏటా లక్ష 50వేల ఎకరాలకు మాత్రమే యాసంగిలో మక్క పంటసాగుచేసేవారు. కానీ, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3 లక్షల ఎకరాలకు పైగా మొక్కపంటను సాగుచేశారు. కానీ వ్యాపారులు సిండికేట్ అవతారమెత్తి మక్కలకు మద్దతు ధర ఇవ్వకుండా ఒక ధరను   కటాఫ్ గా పెట్టుకొని కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపో తున్నారు.

ఒక్క వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు మక్కలను తీసుకొస్తుంటారు. ముఖ్యంగా వరంగల్ చుట్టూ ఉన్న వర్ధన్నపేట, హసన్‌పర్తి. ఐనవోలు, పర్వతగిరి, ధర్మసాగర్, వేలేరు, సంగం. రాయపర్తి తదితర మండలాల నుంచి వరంగల్ మార్కెట్ కు రైతులు మక్క లు తీసుకొస్తారు. కానీ, అక్కడ పూర్తిస్థాయిలో మార్కెఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని అక్కడి రైతులు డిమాండ్‌చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాపారులు అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి, రైతులను దగా చేస్తున్నారు. ఇవన్ని  వ్యవసా య శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

పెట్రోల్ పంపులో ఆరబోత!

మహబూబాబాద్ జిల్లాలో యాసంగి సీజన్లో సా ధారణ సాగు విస్తీర్ణం 60 వేల ఎకరాలు కాగా, సాధారణ సాగు విస్తీర్ణానికి రెట్టింపు విస్తీర్ణం 1,49,000 ఎక రాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. దీ నికి తోడు పంట దిగుబడి ఎకరానికి 35 నుండి 40 క్వింటాళ్ల వరకు దండిగా వచ్చింది. దీనితో సుమారు లక్షన్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట చేతికంది వస్తోం ది.

ఈ క్రమంలో పంటను ఆరబోయడానికి స్థలం లేక రోడ్లపై, ఇంటి పైకప్పులపై, ఎక్కడపడితే అక్కడ ఆరబోయగా.. చివరకు పెట్రోల్ పంపులో సైతం మొక్కజొన్న లు ఆరబోసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఇనుగుర్తి మండల కేంద్రంలోని పెట్రోల్ పంపులో ఓ రైతు తాను పండించిన మక్కలను ఆరబోసుకున్న దృశ్యం ‘విజయక్రాంతి’ కెమెరా క్లిక్ మనిపించింది. 

మహబూబాబాద్, విజయక్రాంతి