14 July, 2026 | 3:31 AM

వీకెండ్ సెలవుల్లో ప్రైవేటు ఆసుపత్రులు!

14-07-2026 12:09 AM
  1. అత్యవసర సేవలకు చేతులెత్తేస్తున్న వైనం.
  2. కాంపౌండర్ల చేతిలోనే గోల్డెన్ అవర్స్. 
  3. పరిస్థితి చేయి దాటే వరకు ఫోన్ లైన్ లోనే ట్రీట్మెంట్.
  4. ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారంపై పెరుగుతున్న విమర్శలు

నాగర్ కర్నూల్ జూలై 13 (విజయక్రాంతి): వైద్యుడు దైవంతో సమానంగా భావించే రోగులకు ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు సెలవు, ఆదివార సమయంలో అత్యవసర సేవలకు మొండి చేయి చూపుతున్నారు. ఫ్యామిలీ డాక్టర్లుగా నమ్మి ఆసుపత్రికి వెళ్లినప్పటికీ సెలవు దినాల్లో అందుబాటులో లేక పోవడంతో చివరికి అ రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కవుతున్నాయి.

షుగర్, బిపి, ఆస్తమా వంటి దీర్ఘకాలిక రోగులతో పాటు పాయిజన్ కేస్, ఫిట్స్ రావడం, గుండెనొప్పి, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర సేవల కొరకు వెళ్లిన క్రమంలో ఫ్యామిలీ డాక్టర్లు తమ చేతికింద పనిచేసిన కాంపౌండర్ల చేతే వైద్యం చేయిస్తున్నారు. ఫలితంగా అత్యంత ముఖ్యమైన సమయం గోల్డెన్ అవర్స్ పూర్తిగా తెలిసి తెలియని కాంపౌండర్ల చేతే వృధా అవుతున్నాయి.

రోగి అదృష్టం బాగుంటే ప్రభుత్వ ఆసుపత్రికి చేరి కొంతమంది బతికి బయట పడుతుండగా మరి కొంతమంది మృత్యువాత పడుతున్న పరిస్థితి నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నాయి. వెంటిలేషన్ సౌకర్యం, 24 గంటలు అందుబాటులోనే ఉంటూ అత్యవసర సేవలు అందిస్తున్నామంటూ బోర్డులు తగిలించి రంగురంగుల పాంప్లెంట్లు ఇతర ప్రచారాలు చేసుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రుల స్పెషలిస్టులు సైతం వేకెండ్ విలసాలకు అలవాటు పడ్డారని రోగులు ఆరోపిస్తున్నారు.

మరి కొంతమంది వైద్యులు కార్పొరేట్ ఆసుపత్రులకు రెఫర్ చేసిన కేసుల కమీషన్, డిన్నర్ మీటింగు లకు హాజరవుతున్నట్లు చర్చ జరుగుతుంది. మరి కొందరు కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో ఒక్కో కేస్ ఆధారంగా ట్రీట్మెంట్ చేస్తూ స్థానికంగా ఏర్పాటు చేసుకున్న ఆస్పత్రులకు వచ్చే రోగులను పెద్దగా పట్టించుకోవడం లేదని చర్చ జరుగుతోంది. తమ అటెండర్స్, కిందిస్థాయి వైద్యుల చేత వైద్యం చేయించి డబ్బు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఫలితంగా స్పెషలిస్టులు ఉన్నారంటూ పేరుమోసిన ఆస్పత్రుల్లోనూ కిందిస్థాయి సిబ్బంది ఫోన్ లైన్ లో వైద్యం చేయిస్తుండడంతో వచ్చిరాని వైద్యం వికటిస్తోందని ఎంతోమంది అమాయకులు వికలాంగులుగా మారుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.  నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని అచ్చంపేట కొల్లాపూర్ కల్వకుర్తి వంటి పట్టణాలతో సహా నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోనూ కొన్ని ఫెర్మోసిన ఆసుపత్రిలోని స్పెషలిస్టులు వీకెండ్ రోజుల్లో  హైదరాబాద్ పైయనమవుతున్నారు.

వారి కిందిస్థాయి సిబ్బంది చేత వైద్యం అందిస్తుండడంతో సైడ్ ఎఫెక్టులు కూడా వస్తున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. కొల్లాపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న ఓ కౌన్సిలర్ వికలాంగుడిగా మారే పరిస్థితి దాపురించిందని చర్చ జరుగుతోంది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోనూ సెలవు దినాల్లో స్పెషలిస్టు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రిలో వాటిని క్యాష్ చేసుకుంటున్నాయని రోగులు మండిపడుతున్నారు.

జిల్లా వైద్యాధికారులు స్పందించి 24 గంటలు అందుబాటులో ఉన్నామంటూ బోర్డులు ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.

విచారణ జరిపి చర్యలు చేపడతాం. 

 ప్రైవేట్ ఆస్పత్రుల బోర్డులపై పేర్లు నమోదు చేసిన విదంగా వైద్యులు అందుబాటులో లేకుండా వారి కిందిస్థాయి సిబ్బంది చేత వైద్యం చేయిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల కొరత లేదు ప్రస్తుతం మెరుగైన వైద్యం అందుతోంది. రోగులు అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. ప్రైవేటు ఆసుపత్రులపై కూడా నిఘా పెంచుతాం.  ప్రైవేటు ఆస్పత్రులలో పరిమితికి మించిన వైద్యం చేసినా అధిక వసూళ్లు చేసినా నేరుగా ఫిర్యాదు చేయండి.

 - డాక్టర్ కృష్ణ, వైద్యాధికారి, నాగర్ కర్నూల్ జిల్లా.