16 August, 2026 | 8:01 PM

ప్రకృతి ప్రకాష్‌కు ప్రతిష్టాత్మక వందే భారత్ జాతీయ సమైక్యతా అవార్డు

16-08-2026 06:58 PM

కోనరావుపేట, ఆగస్టు 16 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ, సమాజ సేవ రంగాల్లో విశేష కృషి చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన డా. ప్రకృతి ప్రకాష్‌కు ప్రతిష్టాత్మక “వందే భారత్ జాతీయ సమైక్యతా అవార్డు–2026” లభించింది.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, వంశీ ఇంటర్నేషనల్ తదితర సంస్థల ఆధ్వర్యంలో ఆగస్టు 15న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు శిరోమణి డా. వంశీ రామరాజు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ, ‘వందే భారత్’ మూవీ డైరెక్టర్, ఆనందలహరి కన్వీనర్ కలారత్న మల్లం రమేష్, ప్రముఖ సినీ నటులు, రచయిత పొలాప్రగడ జనార్దనరావు (చిన్ని) మొగిలి తదితర ప్రముఖుల చేతుల మీదుగా డా. ప్రకృతి ప్రకాష్ అవార్డును స్వీకరించారు.

ఈ సందర్భంగా డా. ప్రకృతి ప్రకాష్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, సమాజ సేవకు గుర్తింపుగా ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. అవార్డును అందించిన నిర్వాహకులకు, తనను ప్రోత్సహిస్తున్న మిత్రులకు, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుద్దాల గ్రామానికి చెందిన డా. ప్రకృతి ప్రకాష్‌కు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి అవార్డు లభించడంపై గ్రామస్థులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.