10-02-2026 12:00:00 AM
పాల్వంచ, ఫిబ్రవరి 9, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 10 వ తేదీ ఉదయం 8 గంటలకు పాల్వంచ శ్రీనివాస కాలనీ గ్రౌండ్ లో ప్రారంభమవుతుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కే. మహీధర్ తెలిపారు. ఈ పోటీలు మొత్తం 58 అంశాల్లో, ఐదు వయో విభాగాల్లో నిర్వహించబడతాయని తెలిపారు. పోటీల్లో విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు ,మెడల్స్ ప్రదానం చేస్తారని చెప్పారు.
ఈ పోటీల్లో ప్రతిభ చూపిన అథ్లెట్లలో నుంచి 30 మందిని ఎంపిక చేసి, ఈ నెల 21వ తేదీ నుంచి హనుమకొండలోని జే ఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు పంపిస్తామన్నారు. గత సంవత్సరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 54 పాయింట్లతో జిల్లాకు మంచి పేరు వచ్చిందని, అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా రాష్ట్రస్థాయిలో విజయం సాధించాలనే లక్ష్యంతో జిల్లా చీఫ్ కోచ్ నాగేంద్ర ఆధ్వర్యంలో కోచ్లు ఎర్రయ్య, గిరి మల్లికార్జున్ సహకారంతో అథ్లెట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమాలకు,పోటీల నిర్వహణకు జిల్లా క్రీడా అధికారి ఎం. పరంధామ రెడ్డి విశేష ప్రోత్సాహం అందిస్తున్నారని పేర్కొన్నారు. 10వ తేదీ జరిగే పోటీలను ఎస్జీఎఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో పీటీలు నిర్వహిస్తారని తెలిపారు.