గర్భం దాల్చిన మైనర్ బాలిక
గర్భస్రావం కోసం టాబ్లెట్లు వాడకం... ప్రాణాపాయం?
పాల్వంచలో కలకలం
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem) పాల్వంచ పట్టణంలో మైనర్ బాలిక గర్భం దాల్చిన సంఘటన సంచలనాన్ని రేపుతోంది. పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థలు కలిగిన ఓ కళాశాలలో చదువుతున్న ఒక మైనర్ విద్యార్థిని గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. గర్భ శ్రావణం కోసం ఆ బాలిక టాబ్లెట్లు వాడినట్లువిశ్వసనీయ సమాచారం. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఆమెను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
బాలికకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థిని వివరాలు తెలుసుకునేందుకు ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ భాగ్యాను సంప్రదించగా అడ్మిట్ అయిన మాట వాస్తవమే, ఈ కేసు విషయంలో ఎలాంటి సమాచారం వెల్లడించవద్దని పోలీసు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. మైనర్ బాలిక అయినందున మరింత సమాచారం ఇవ్వలేమని స్పష్టం చేశారు. విద్యాసంస్థల చైర్మన్ ను వివరణ కోరెందుకు ప్రయత్నించగా అటువంటి ఘటన గురించి ప్రస్తుతం పూర్తి సమాచారం లేదు, తాను లోకల్లో లేనని పూర్తి వివరాలు తెలుసుకొని తర్వాత చెబుదామని దాటవేశారు.
మైనర్ విద్యార్థినికి సంబంధించిన ఘటన కావడంతో మరింత సున్నిత అంశంగా మారింది. ఘటన వెనుక పరిస్థితి ఏమిటి, విద్యార్థిని ఎలా ఈ పరిస్థితికి వచ్చింది, ఆమెకు అవసరమైన కౌన్సిలింగ్ మార్గ నిర్దేశం అందించారా, తదితర ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. విద్యాసంస్థల పరిధిలో విద్యార్థుల భద్రత పర్యవేక్షణ నైతిక బోధన, కౌన్సిలింగ్, వ్యవస్థల బలోపేతం అవసరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయంపై పట్టణ పోలీసులు వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేశారు. బాధ్యులను అరెస్టు చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.




