28 February, 2026 | 12:24 PM

కోటి మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు....

28-02-2026 11:10 AM

పి అండ్ జి 'శిక్ష' వినూత్న అడుగు

గిరిజన ప్రాంత విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ప్రత్యేక శిక్షణ.. మైసిగండి ఆశ్రమ పాఠశాలలో కార్యక్రమం

​కడ్తాల్,(విజయక్రాంతి): నిరుపేద, గిరిజన విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో పి అండ్ జి (P&G) ఇండియా చేపట్టిన ‘శిక్ష’ కార్యక్రమం కోటి మంది విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు దిశగా విజయవంతంగా ముందుకు సాగుతోంది. కడ్తాల్ మండలంలోని మైసిగండి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసి, విద్యార్థులకు డిజిటల్ శిక్షణను ప్రారంభించారు.ఏసర్ (ASER 2024) నివేదిక ప్రకారం 5వ తరగతి విద్యార్థుల్లో 50% మంది కనీసం 2వ తరగతి పాఠాలను చదవలేకపోతున్నారు. ఈ పునాది స్థాయి లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా పి అండ్ జి పనిచేస్తోంది. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించి, 'మైండ్‌స్పార్క్' వంటి అడాప్టివ్ లెర్నింగ్ టూల్స్ ద్వారా వారి అభ్యసన స్థాయిని మెరుగుపరుస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ....

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సుమారు 35 వేల మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతోంది.పిల్లల్లో ఉండే అభ్యసన లోపాలను తల్లిదండ్రులు కేవలం ఒక దశగా భావించి వదిలేయకూడదు. సరైన సమయంలో అందించే మద్దతు కోటి మంది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని రజత్ బ్రార్, సీనియర్ డైరెక్టర్, పి అండ్ జి ఇండియా తెలిపారు.

సందడి చేసిన సినీ తారలు.....

​ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీమణులు ప్రణీత సుభాష్, సమీరా రెడ్డి పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. ​ప్రణీత సుభాష్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదువులో వెనుకబడినప్పుడు కలిగే ఆత్మసందేహం గురించి ప్రస్తావిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని కొనియాడారు. ​సమీరా రెడ్డి మాట్లాడుతూ.... పాఠశాల రోజుల్లో సబ్జెక్టుల పట్ల ఉండే భయాన్ని పోగొట్టి, ఆత్మవిశ్వాసం పెంచడంలో శిక్ష కార్యక్రమం కృషి అభినందనీయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ సీఈఓ ప్రణవ్ కొఠారి, మేనేజర్ ఆదర్శ్ రెడ్డి, గిరిజన శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, డీటీడీఓ రామేశ్వరి, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.