13 July, 2026 | 2:38 AM

వర్షాలకు ముందస్తు జాగ్రత్తలు

13-07-2026 01:35 AM

-సైడ్ కాలువల శుభ్రత చేపట్టిన సర్పంచ్ సుగుణ

వెంకటాపూర్, జులై 12 (విజయక్రాంతి): మండల కేంద్రంలో ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో గ్రామంలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ సుగుణ తెలిపారు.

వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం వల్ల దోమల వ్యాప్తి, అంటువ్యాధులు, రహదారులు దెబ్బతినడం, ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో గ్రామంలోని సైడ్ కాలువల శుభ్రత పనులను వేగవంతం చేశారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, వీధుల్లో పూడిక, చెత్త, రాళ్లు, మట్టి, గడ్డి పేరుకుపోయి మూసుకుపోయిన సైడ్ కాలువలను లేబర్లతో పాటు జేసీబీ సహాయంతో పూర్తిస్థాయిలో శుభ్రం చేయిస్తున్నారు. ఈ పనులను సర్పంచ్ సుగుణ స్వయంగా పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు చేశారు.

వర్షపు నీరు ఎలాంటి ఆటంకం లేకుండా కాలువల ద్వారా సాఫీగా వెళ్లేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే వెంటనే గుర్తించి సమస్యను పరిష్కరించాలని పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, కాలువల్లో చెత్త వేయకుండా సహకరించాలని కోరారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యానికి గ్రామపంచాయతీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా వర్షాల కారణంగా ఎదురయ్యే సమస్యలను తగ్గించేందుకు నిరంతరం చర్యలు కొనసాగిస్తామని సర్పంచ్ సుగుణ పేర్కొన్నారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని పరిశుభ్రమైన, సురక్షితమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు, ఎన్‌ఎస్యూఐ మండల అధ్యక్షుడు కోటి, ఆత్మ కమిటీ డైరెక్టర్ రవి, గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.