9 June, 2026 | 2:10 AM

ప్రభుత్వ బడుల్లో ప్రీప్రైమరీ విద్య మిథ్యే!

09-06-2026 12:52 AM
  1. పూర్తిస్థాయిలో అమలుకాని ప్రీప్రైమరీ విధానం
  2. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల పాఠశాలలకే పరిమితం
  3. సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ లేక ప్రైవేట్ బాట పడుతున్న తల్లిదండ్రులు

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య పునాది లాంటిది. ఇంగ్లిష్ మీడియం చదువులకు, ప్రీప్రైమరీ (పూర్వ ప్రాథమిక) విద్యకు తల్లిదండ్రులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం తల్లిదండ్రులు ఆశిస్తున్న ప్రీప్రైమరీ విద్యను అందిం చలేకపోతున్నది. ప్రైవేట్ పాఠశాలల్లో వేలల్లో ఫీజులు కట్టలేనివారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని భావిస్తున్నారు.

కానీ, అక్కడ మాత్రం ప్రీప్రైమరీ విద్య పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటంలేదు. దీంతో ఇక చేసేదిలేక తిరిగి ప్రైవేట్ పాఠశాలలకే పంపించేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు మొదలు పెట్టకుండా కొన్ని చోట్లనే అమలుచేస్తూ మమ అనిపిస్తున్నదనే విమర్శలున్నాయి.

విడతలవారీగా పరిమితం..

తల్లిదండ్రులు కోరుకునే విద్య ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తే లక్షలు ఖర్చుచేసి తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించే పరిస్థితి ఉండదు. కానీ, ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించామని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వం.. దీనిని విడతలవారీగా అమలు చేయడానికే పరిమితమవుతున్నది. రాష్ట్రం లో 18 వేల వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఇందులో 2 వేల వరకు స్కూళ్లలో జీరో స్ట్రెంత్ ఉండటంతో అవి మూతపడ్డాయి.

ఇక మిగిలిన 16 వేల పాఠశాలలుంటే ఇందులో కేవలం 4,131 బడుల్లోనే ప్రీప్రైమరీ తరగతులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలోనూ గతంలోనే మొదలైన పాఠశాలలు 362 కాగా, 2025 విద్యాసంవత్సరంలో ప్రారంభించినవి 1,000 ఉండగా, ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తున్నవి 2,769 బడులు ఉన్నాయి.

అంటే మొన్నటివరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 1,362 పాఠశాలల్లోనే ప్రీప్రైమరీ తరగతులు అందుబాటులో ఉన్నాయి. ఆ సంఖ్య ఇప్పుడు నాలుగు వేలకు దాటినా.. ఇంకా దాదాపు 12 వేల పాఠశాలల్లో ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ అందుబాటులోనే లేదు. 

ప్రైవేట్ బాట పడుతున్న తల్లిదండ్రులు

మూడేళ్లు వస్తే చాలు తమ పిల్లలను పేరెంట్స్ స్కూళ్లకు పంపిస్తున్నారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొన్నటి వరకు ఒకటో తరగతి చదవాలంటే ఐదేళ్లు నిండి ఉండాలనే నిబంధన ఉండేది. దీనికి తోడూ ప్రీప్రైమరీ కూడా లేకపోవడంతో పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ బడులకే పంపించేవారు. మనోవైజ్ఞానిక శాస్త్ర వేత్తల సూచనలు, ఇతర అధ్యాయనాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్లు నిండే వరకు పిల్లలు తల్లి సంరక్షణలోనే ఉండాలనే నిబంధన ఉండేదని నిపుణులు చెబుతున్నారు.

దాని ప్రకారమే ఐదేళ్లు నిండితేగానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో అడ్మిషన్ ఇచ్చేవారు కాదు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేవారు. దీనికితోడూ ప్రభుత్వ బడుల్లో ప్రీప్రైమరీ విద్య కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో మూడేళ్లు వచ్చిన వెంటనే పిల్లలను ప్రైవేట్‌లోనే చేర్పిస్తున్నారు.

ఇంగ్లిష్ మీడి యం చదువులొచ్చాక మూడేళ్లకే పిల్లలను స్కూళ్లకు పంపించే విధానం ఎక్కువైంది. అదే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి పూర్తిచేయడానికి ఆరేళ్లు నిండి ఉండాలనే విధానం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం నాలుగు వేల పాఠశాలల్లో సరైనా వసతులు లేకుండానే ప్రీప్రైమరీని అమలు చేస్తున్నదనే విమర్శలున్నాయి.

ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారిని కూడా తీసుకుని తరగతులు చెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల ఒకే తరగతి గదుల్లో మల్టీ క్లాసులను నిర్వహించే పరిస్థితి ఉంది. సరిపడా టీచర్లను నియమించకుండా ఈ తరగతులను ప్రారంభించినా అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొక్కుబడిగా అమలు చేయొద్దు

ప్రభుత్వం మొక్కుబడిగా ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించకూడదు. సరిపడా తరగతి గదులు, మౌలిక సదుపా యాలు సమకూర్చి అప్పుడు ప్రారంభించాలి. పైగా అన్ని పాఠశాలల్లో ప్రారంభిం చకుండా కొన్ని స్కూళ్లలోనే ప్రీప్రైమరీ అమల్లోకి తెస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రీప్రైమరీ పాఠశాలల్లో తరగతులు ప్రారంభించాలి. శిక్షణ పొందిన ఉపా ధ్యాయులను నియమించాలి.

ప్రభుత్వ విద్యపై పేరెంట్స్‌కు నమ్మకం కలిగించాలి. ప్రతి సంవత్సరం కొన్ని పాఠశాలలకే అనుమతులు ఇవ్వడం వల్ల ఆశించిన మేర ప్రాథమిక పాఠశాలల బలోపేతం జరగదు. పైగా దీనివెనుక ప్రభుత్వ పాఠశాలలు ఎత్తివేసే కుట్ర ఉంద నే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 ఎన్ తిరుపతి, 

టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి