9 June, 2026 | 3:15 AM

ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు?

09-06-2026 12:55 AM

రాజకీయ ఒత్తిళ్లతో అర్హుల జాబితాలో మార్పులు..

అర్హులకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతి

శాయంపేటలో లబ్ధిదారుల ఎంపికపై బాధితుల ఆరోపణలు

హనుమకొండ జూన్ 8 (విజయక్రాంతి): ఎస్సీ కార్పొరేషన్ 2025-26 ఆర్థిక సహాయ పథకాల కింద ఎలక్ట్రానిక్ స్కూటీలు, ఆటోలు, పాడి గేదెల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శాయంపేట మండలానికి చెందిన బాధితులు సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

మండలంలోని 18 గ్రామాలకు సంబంధించి 50 యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో మొదట ప్రభుత్వ నిబంధనలు, సివిల్ స్కోర్ ఆధారంగా రూపొందించిన అర్హుల జాబితాను స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో మార్చివేశారని వారు ఆరోపించారు. అర్హతలున్న పేదల పేర్లు తొలగించి, పలుకుబడి కలిగిన వ్యక్తులు, ప్రజాప్రతినిధుల అనుచరుల పేర్లు చేర్చినట్లు పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపి, మార్పులకు గురైన జాబితాను రద్దు చేసి, మొదట రూపొందించిన అర్హుల జాబితా ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అర్హులకు న్యాయం చేయాలని కోరుతూ కొమ్ముల సతీష్ కుమార్, రేణుకుంట్ల భరత్, తుడుం రవీందర్, గజ్జి శంకర్ తదితరులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.