31 August, 2026 | 9:17 PM

ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

31-08-2026 08:11 PM

– ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి  మంద మకరందు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఉట్నూర్ మండలం భూరుమాజీ గూడ గ్రామానికి చెందిన కుర్సెంగ మహేష్ తనకి ల్యాప్ టాప్ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. గుడిహత్నూర్  మండలం తోషం గ్రామానికి చెందిన మెస్రం శ్రీమ తనకు బ్లడ్ కాన్సర్ చికిత్స కొరకు ఆర్ధిక సహాయం చేయమని కోరారు. జైనూర్ మండలం జంగావ్ గ్రామానికి చెందిన కోవ విష్ణు తనకు పై అటవీ హక్కు పత్రం మంజూరు కల్పించామని విజ్ఞప్తి చేశారు. కాసిపేట్ మండలం గుండ్ల పహాడ్ గ్రామానికి చెందిన పంద్రం అనసూయ తనకు కారుణ్య నియామకంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కొరకు దరఖాస్తు అందజేశారు. బజారహత్నూర్ మండలం కొత్త గూడ గ్రామానికి చెందిన రత్నకిశోర్ తనకు ఆర్థిక సహాయం ఇప్పించమని కోరారు.

అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశించారు.