31 August, 2026 | 9:39 PM

వెలుగొండకు నికర జలాలు మళ్లిస్తే తెలంగాణకు దుర్దినం

31-08-2026 08:27 PM

కృష్ణా వరద జలాలనే వినియోగించాలి

జలహక్కులపై ప్రభుత్వం స్పందించాలి

పాలమూరు-రంగారెడ్డి పనులు నిలిపివేయడం వెనుక రాజకీయ కారణాలు

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి,(విజయక్రాంతి): కృష్ణా నది వరద జలాల వినియోగం కోసమే నిర్మించిన వెలుగొండ ప్రాజెక్టుకు నికర జలాలను వినియోగించడాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం వహిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా, ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర హక్కుల అంశాలను వైట్‌బోర్డుపై చిత్రాలతో సుమారు రెండు గంటల పాటు వివరించారు. వెలుగొండ ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలను మాత్రమే వినియోగించాలన్న నిబంధన ఉందని, అయితే నికర జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ, ముఖ్యంగా పాలమూరు ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు.

పాలమూరు ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 2023 నాటికే సుమారు 90 శాతం పూర్తయ్యాయని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. పంపింగ్ స్టేషన్లు, నాలుగు రిజర్వాయర్లు, టన్నెల్‌లతో పాటు ప్రధాన పనులు పూర్తయ్యాయని తెలిపారు. నార్లాపూర్-ఏదుల లింక్ కెనాల్ సహా మిగిలిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా పూర్తి చేయడం లేదని విమర్శించారు. ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తే పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున నీటి నిల్వ సామర్థ్యం పెరిగేదని అన్నారు. ప్రాజెక్టు పనులు ఆలస్యమైతే ఇతర రాష్ట్రాల ప్రయోజనాలకు అవకాశం కలుగుతుందని ఆరోపించారు.

 తెలంగాణ జలహక్కులపై పోరాటం కొనసాగుతుంది

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యం, జూరాల వద్ద వరద జలాల వినియోగం, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు తదితర అంశాలను నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం తాము పోరాడామని పేర్కొన్నారు. తెలంగాణ జలహక్కులపై అవగాహన లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చామని ఆయన అన్నారు.