1 September, 2026 | 5:26 PM

మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణ త్వరలో పూర్తి

31-08-2026 08:42 PM

వారం, పది రోజుల్లో మిగిలిన భూమి సేకరించి అప్పగిస్తాం: కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గాన్ని డబుల్ లైన్‌గా అభివృద్ధి చేసే పనుల్లో భాగంగా వనపర్తి జిల్లాలో చేపట్టాల్సిన భూసేకరణను వారం, పది రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం రాష్ట్రంలోని రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, తలెత్తుతున్న ఇబ్బందులపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో రైల్వే విస్తరణ, డబుల్ లైన్ తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసి భూములను సంబంధిత శాఖలకు అప్పగించాలని కలెక్టర్లను ఆదేశించారు. మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్ కోసం వనపర్తి జిల్లా పరిధిలోని పారేపల్లి వద్ద 69.09 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ఇప్పటివరకు 43.34 ఎకరాల భూమిని సేకరించి అవార్డు పాస్ చేసి రైతులకు పరిహారం అందజేశామని తెలిపారు. మిగిలిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి పది రోజుల్లో పూర్తి చేసి రైల్వే శాఖకు భూమిని అప్పగిస్తామని వెల్లడించారు.