31 August, 2026 | 8:54 PM

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల దగా పాలనపై సమరభేరి

31-08-2026 08:00 PM

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

సెప్టెంబర్ 2వ తేదీ నుండి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల దగా పాలనపై సెప్టెంబర్ 2వ తేదీ నుండి బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమం (BRS Samarabheri Program) ద్వారా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (Former MLA Gandra Venkataramana Reddy), వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పి ఛైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. ఈ మేరకు సమరభేరి కార్యక్రమంపై సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్నప్పటికి అనేక హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే స్వయంగా 6 గ్యారెంటీల కార్డులను ముద్రించి ప్రజలకు అందజేస్తూ కార్డును జాగ్రత్తగా దాచుకోవాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలన్నింటిని అమలు చేస్తామని భరోసా ఇచ్చారని వారి మోసపూరిత మాటలు నమ్మిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని అన్నారు. 

మహిళలకు..

మహిళలను ఆకట్టుకోవడానికి ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. అదేవిధంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణలక్ష్మి పథకానికి అదనంగా తులం బంగారం అందిస్తామని అన్నారని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రస్తుతం అందుతున్న పెన్షన్లను రూ.4,000 కు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు. కాని ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు.

రైతులకు..

బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచి ఎకరాకు రూ.15,000 అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రైతు బీమా ప్రీమియం, యూరియా సరఫరా, సాగునీరు, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ వంటి అంశాల్లో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుందని అన్నారు. సాగునీటి రంగాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్వహణ, నీటి నిల్వ వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అనేక భూములు 22 A నిషేధిత జాబితాలో ఉండటం వల్ల రైతులు, భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

నిరుద్యోగ యువతకు..

నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇస్తామని, ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని కాని నేటికి నిరుద్యోగ యువత ఆశించిన స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగలేదని అన్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు

సింగరేణి కార్మికులకు..

సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మెడికల్ బోర్డుల ద్వారా అనేక మంది కార్మిక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించామని, ప్రస్తుతం ఆ ప్రక్రియలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

పారిశుధ్యం..

బీఆర్ఎస్ హయాంలో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని ఇప్పుడు అ పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని లేదంటే ప్రజల అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.