6 March, 2026 | 5:23 PM

కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ప్రారంభమైన ప్రగతి ప్రణాళిక

06-03-2026 01:24 PM

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక(Praja Palana Pragati Pranalika) కార్యక్రమం కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని మున్సిపాలిటీ 18వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ షహీన్ సుల్తానా, వైస్ చైర్‌పర్సన్ డా. కొత్తపల్లి అనిత, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు , మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక మార్చి 6 నుండి జూన్ 12, 2026 వరకు 99 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. 

99 రోజుల పాటు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది , పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.