9 March, 2026 | 11:48 PM

పాలిటెక్నిక్ కళాశాలలో ప్రజా పాలన, ప్రణాళిక కార్యక్రమం

09-03-2026 09:22 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న “99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ, విద్యాశాఖ సంయుక్తంగా సోమవారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జె. సంపత్, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి దావ స్వాతి–రమేష్ బాబు మాట్లాడారు.

2వ వార్డ్ కౌన్సిలర్ నిచకోలా వంశీ కృష్ణ , ఇతర కౌన్సిలర్లు కళాశాలను సందర్శించారు. వారు కళాశాల క్యాంపస్, హాస్టళ్లు, ల్యాబొరేటరీలు వర్క్‌షాప్‌లను పరిశీలించి, కళాశాలలో ఉన్న సౌకర్యాలు పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాలిటెక్నిక్ సాంకేతిక విద్య యొక్క ప్రాముఖ్యత, యువతకు ఉపాధి అవకాశాలు నైపుణ్యాభివృద్ధి గురించి వివరించారు.

అలాగే 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా క్యాంపస్ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వృక్షారోపణ కార్యక్రమాలలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని కోరారు. కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రత నిర్వహణ, వృక్షారోపణ కార్యక్రమాలకు మున్సిపాలిటీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల అధ్యాపకులు, హెచ్‌ఓడీలు (HODs), సిబ్బంది, విద్యార్థులు క్యాంపస్ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్  డా. ఎం. దేవేందర్, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.