నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం పనిచేయాలి
- జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్
కల్వకుర్తి: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాన్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రతి ఉపాధ్యాయుడు పని చేయాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు . బుధవారం ఎస్‌సీఆర్టీ ఆధ్వర్యంలో ప్రాథమిక ఉపాధ్యాయులకు కల్వకుర్తిలో జరుగుతున్న ప్రత్యేక శిక్షణా తరగతులను పరిశీలించి మాట్లాడారు. ప్రాథమిక విద్యార్థుల్లో చిన్న వయస్సులోనే మంచి అభ్యాస అలవాట్లు పెంపొందితే వారి భవిష్యత్ విద్యాభ్యాసం మరింత సులభంగా సాగుతుందని తెలిపారు. ముఖ్యంగా చదవడం, రాయడం, లెక్కించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చోట వ్యక్తిగత శ్రద్ధతో బోధన అందించాలని సూచించారు.
ఒక విద్యార్థి కూడా అభ్యాసంలో వెనుకబడకుండా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రతి పాఠశాలలో ప్రతిరోజూ పఠన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చిన్నారుల్లో పుస్తక పఠన అలవాటు పెంపొందితే భాషా నైపుణ్యాలు, పదసంపద, భావవ్యక్తీకరణ, అర్థగ్రహణ సామర్థ్యం పెరుగుతాయని, తద్వారా అన్ని సబ్జెక్టుల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉంటాయని తెలిపారు.
పాఠ్యపుస్తకాలతో పాటు అదనపు పఠన సామగ్రిని కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి తరగతి గదిని విద్యార్థులు ఆనందంగా నేర్చుకునే అభ్యాస కేంద్రంగా తీర్చిదిద్దాలని డీఈఓ తెలిపారు. కేవలం ఉపన్యాస పద్ధతిలో కాకుండా కార్యకలాపాల ఆధారిత బోధన, కథలు, పాటలు, ఆటలు, చిత్రాలు, బొమ్మలు, బోధనా-అభ్యాస సామగ్రి (టీ.ఎల్.ఎం.) వినియోగం ద్వారా బోధనను ఆసక్తికరంగా మార్చాలని సూచించారు. విద్యార్థులు స్వయంగా పాల్గొని నేర్చుకునే అవకాశాలు కల్పిస్తే అభ్యాస ఫలితాలు మరింత మెరుగుపడతాయని వివరించారు.
ఎస్‌సీఆర్టీ రూపొందించిన శిక్షణా మాడ్యూళ్లను ప్రతి ఉపాధ్యాయుడు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వాటిని తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న బోధనా పద్ధతులను రోజువారీ బోధనలో వినియోగిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ముఖ్యంగా ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు పూర్తిచేసేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. విద్యార్థుల అభ్యాసంలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని కూడా పెంచాలని తెలిపారు.






