9 March, 2026 | 11:46 PM

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

09-03-2026 09:30 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా మత్తు పదార్థాల వినియోగం తీవ్రమైన సమస్యగా మారిందని, ముఖ్యంగా యువత ఈ చెడు అలవాట్లకు బానిస అవుతుండటం ఆందోళనకరమని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో 20 పాఠశాలలకు చెందిన ప్రహరీ క్లబ్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆయన మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుట్కా, సిగరెట్, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు.

కొంతమంది సరదాగా లేదా స్నేహితుల ఒత్తిడితో వీటిని ఉపయోగించడం ప్రారంభించి తర్వాత అలవాటుగా మారి జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.మత్తు పదార్థాల వల్ల మెదడు పనితీరు దెబ్బతిని గుండె సంబంధిత వ్యాధులు, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఇవి వ్యక్తిగత జీవితమే కాక కుటుంబం, సమాజంపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయని చెప్పారు. విద్యార్థులు డ్రగ్స్ నిరోధక సైనికులుగా పనిచేసి జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నార్కోటిక్స్ పోలీస్ విభాగానికి చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మత్తు పదార్థాల దుర్వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి శాంతికుమార్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్, రిసోర్స్ పర్సన్లు అంజాద్ పాషా, నగేష్, విద్యాసాగర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.