13 May, 2026 | 2:24 AM

నేడు జీళ్లచెరువులో ‘ప్రజాదర్బార్’

13-05-2026 01:18 AM

14న ఏదులాపురం, రామన్నపేట క్లస్టర్ పరిధిలో ప్రజాదర్బార్

వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి

కూసుమంచి, మే 12 (విజయక్రాంతి): సామాన్యుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలనే సంకల్పంతో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేపట్టిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం పాలేరు నియోజకవర్గంలో విజయవంతంగా జరుగుతోంది.

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి వినతులు స్వీకరిస్తుండటంతో జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 13న బుధవారం, 14న గురువారం  మూడు ప్రధాన క్లస్టర్ల పరిధిలో నిర్వహించనున్న ప్రజా దర్బార్ల వివరాలను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి వెల్లడించారు.

బుధవారం జీళ్ళచెర్వులో..

ఈ నెల 13న బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కూసుమంచి మండలం జీళ్ళచెర్వు క్లస్టర్ పరిధిలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. గ్రామంలోని స్టార్ గార్డెన్స్ ఎదురుగా ఉన్న మైదానంలో జరిగే ఈ దర్బార్కు జీళ్ళచెర్వుతో పాటు పోచారం, తురకగూడెం, నేలపట్ల, అగ్రహారం, కోక్యా తండా, లోక్యా తండా, ముత్యాలగూడెం, చేగొమ్మ, ధర్మతండా, మునిగేపల్లి, కేశవాపురం, కిష్టాపురం గ్రామాలకు చెందిన ప్రజలు హాజరుకావచ్చు.

గురువారం ఉదయం ఏదులాపు రంలో... మధ్యాహ్నం రామన్నపేటలో..

గురువారం ఉదయం 8 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ క్లస్టర్-1 పరిధిలోని 15 వార్డుల (1,2,3,4,5,18,1 9,20,21,22, 23,24,30,31,32) ప్రజల కోసం 22వ వార్డు సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఉంటుంది.

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రామన్నపేట క్లస్టర్ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో దర్బార్ నిర్వహిస్తారు. 1వ డివిజన్ కైకొండాయిగూడెం, 59వ డివిజన్ దానవాయిగూడెం, 60వ డివిజన్ రామన్నపేట ప్రజలు ఇక్కడ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చు.

వేదికలపైనే పరిష్కారం!

ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కార దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని ఇప్పటికే మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు ఈ వేదికలపై అందుబాటులో ఉంటారు. ప్రజల ప్రతి విన్నపాన్ని నేరుగా పర్యవేక్షిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.