16 July, 2026 | 3:16 AM

హిందూమతం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం!

16-07-2026 12:00 AM

హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ (హెచ్పీఈ) ప్రధాన కార్యదర్శి రమణమూర్తి

రమణమూర్తిపై దాడిని  ఖండించిన పీఠాధిపతులు

ముషీరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ’నేను హిందువు గా పుట్టాను. హిందువుగానే వున్నాను. చివరిదాకా హిందువుగానే వుంటానని హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ (గెచ్పీపీ) ప్రధాన కార్యదర్శి, జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంపాదకుడు విజయవిహారం రమణమూర్తి అన్నారు.

బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం బీఆర్కే న్యూస్ లో విజయవిహారం రమణమూర్తిపై కాశ్యప్ రెడ్డి దాడిని ఖండిస్తూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందూమతానికి చేటు, కీడు తెచ్చే చర్యల్ని ప్రశ్నిస్తే అసహనంతో రెచ్చిపోయి హింసాత్మక దాడుల కు దిగబడినా బెదిరే ప్రసక్తే లేదని రమణమూర్తి తేల్చిచెప్పారు. ఎన్ని పాశవిక దాడు లు చేసినా - విద్వేషం, అసమానత్వం లేని హిందూమతం అత్యున్నత సనాతన విలువల్ని పరిరక్షించేందుకు ఒక హిందువుగా ఎంతటి త్యాగాలకైనా సిద్ధమే అని ఆయన అన్నారు.

ఏ మతంలోకైనా రాజకీయ నాయకులు దూరడానికి వీల్లేదని, మతం ఏదై నా దాని పవిత్రతను కాపాడటానికి రాజకీయ కల్మషం అంటకుండా చూడాల్సిన అప్రమత్తత ప్రజలకు ఎంతైనా అవసరమని రమ ణమూర్తి అన్నారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ నిజమైన హిందూ మతం అంటే ఏమిటో ఆధా రాలతో సహా మాట్లాడుతూ ఉంటే మతోన్మాదులకు రుచించడం లేదని అందుకే దాడులు చేస్తున్నారని అన్నారు.

అత్యంత జ్ఞానసమూపర్జన కలిగిన రమణమూర్తిని అందరూ రక్షించుకోవాలని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైందవంలో మచ్చుకైనా విద్వేషం, అసహనం కనిపించవని-కాని ఆ అవలక్షణాలను నరనరానా జీర్ణించుకున్న ఉన్మాద శక్తులు రమణమూర్తి వంటి రుషితుల్యుడిమీద దాడికి తెగబడితే సాధు సంతులోకం ఏ మా త్రం సహించదని, ఇట్లాంటి శక్తులనుఈ ధర్మం నుంచి ఏరివేయాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీ విజయ శంకరస్వామి హెచ్చరించారు.

పరమ అద్భుతమైన కృష్ణ పరమాత్ముడి విశ్వరూప సందర్శన చిత్రంలో ఓ రాజకీయ నేత ముఖాన్ని తగిలించడం ఎంతో అపసవ్యమైన చర్య అని, దాన్ని ఎత్తిచూపిన రమణమూర్తి నిజమైన హిందువు అని ఆధ్యాత్మిక ప్రవచనకారుడు దరూరి నరసింహాచార్యులు అన్నారు. హిందూమతం మూలాల్ని ఎరిగిన రమణమూర్తి వంటి రుషితుల్యుడిమీద దాడికి దిగడం పరమ దుర్మార్గం, ఉన్మాదం అని, మతాన్ని రాజకీయాలకు దూరంగా వుంచాలని, ఇలా అసహనంతో దాడులకు దిగడం పాశవికమని బిర్లామందిర్ ప్రధానార్చకులు లక్ష్మి నరసింహాచార్యులు అన్నారు. కార్యక్రమంలో యాచ్‌జిఅర్‌ఎస్ అధ్యక్షులు అలీ బాఖ్రీ, మూర్తి, విజయ్ రెడ్డి, శ్రీనివాస్, లుబ్నా సర్వాత్, స్కైలాబ్ తదితరులు పాల్గొన్నారు.