నేడు బెంగాల్, తమిళనాడులో పోలింగ్
- ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం
- తమిళనాడులో ఒకే విడత
- బెంగాల్‌లో మొదటి విడత పోలింగ్.. 29న రెండో విడత
చెన్నై, కోల్‌కతా, ఏప్రిల్ ౨౨: పశ్చిమ బెంగాల్, తమిళనాడులో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ సిబ్బంది బుధవారం సాయంత్రమే ఎన్నికల సామగ్రి తీసుకుని తమకు పోలింగ్ కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్లారు.
తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ 4,023 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ డెమోక్రటిక్ అలయన్స్, ఏఐఏడీఎంకే నేతత్వంలోని ఎన్డీయే కూటమి మధ్య ద్విముఖ పోరు నెలకొంది.
పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు గాను రెండు విడతల్లో పోలింగ్ జరుగనుంది. రేపు జరిగే మొదటి విడతలో 152 స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. మిగిలిన 142 స్థానాలకు ఈనె 29న పోలింగ్ జరుగుతుంది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోరు సాగుతున్నది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలూ మే 4న విడుదల కానున్నాయి.






