09-02-2026 04:34:05 PM
జిల్లా ఎస్పీ నితిక పంత్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఈ నెల 11న ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఎన్నికల కోసం పోలీస్, ఇతర శాఖల సిబ్బంది కలిపి మొత్తం 712 మందిని విధుల్లో నియమించినట్లు పేర్కొన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల నుండి సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుందని, ఈ సమయంలో ఎన్నికల సభలు, సమావేశాలు, ఇంటింటా ప్రచారం, లౌడ్‌స్పీకర్లు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
. అదే విధంగా సోమవారం సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలో 163 బి.ఎన్.ఎస్.ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుమికూడరాదన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలకు అనుమతి లేదని, సంబంధిత అధికారులు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే సంబరాలు నిర్వహించుకోవాలని సూచించారు.
రెండు మున్సిపాలిటీ పరిధిలో 2 స్టాటిక్ సర్వైలెన్స్ (SST) టీములు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ (FST) టీములు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వ్యక్తులను ఇప్పటికే బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. ఆసిఫాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఎస్పీ పరిశీలించారు.
అనంతరం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల (బాలికలు), ఉర్దూ ZPSS పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీస్ అధికారులతో చర్చించారు. కౌంటింగ్ రోజున కౌంటింగ్ కేంద్రం పరిసరాలు, కళాశాల ఆవరణలో అనవసరంగా ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సతీష్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ గజానంద్ పాల్గొన్నారు.