గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండల పరిధిలోని తూర్పు తండాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఎస్ ఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తుల నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన 20 కిలోల బెల్లం, 10 లీటర్ల నాటుసారా 250 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 250 లీటర్ల బెల్లం పానకాన్ని పోలీసులు ఘటనా స్థలంలోనే ధ్వంసం చేశారు. అనంతరం గ్రామంలో ప్రజలకు, యువతకు నాటుసారా తయారీ, అమ్మకాలు, వినియోగం వల్ల కలిగే నష్టాలు, చట్టపరమైన చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలో ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
దంతాలపల్లి మండలం బొడ్లాడ క్రాస్‌రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గుడుంబా తయారీకి ఉపయోగించే 2,250 కిలోల నల్ల బెల్లం, 20 కిలోల పట్టిక పట్టుబడ్డాయి. బొలెరో వాహనంలో వీటిని తరలిస్తున్న హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన కెంపే శివానందను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనం, బెల్లం, పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.2.27 లక్షలు ఉంటుందని, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.






