12 May, 2026 | 8:16 PM

చోరీ ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు

12-05-2026 06:53 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): నగరంలోని బీజేఆర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నేపాలి జాతీయులకు స్థానిక పోలీసులు సోమవారం ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్‌లో చోటుచేసుకున్న పలుచోట్ల చోరీ ఘటనల్లో నేపాలి జాతీయుల ప్రమేయం ఉన్నట్లు వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు స్థానిక ప్రజలతో సమావేశమై భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.

అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే అద్దెకు ఇళ్లు ఇచ్చే యజమానులు తప్పనిసరిగా కిరాయిదారుల పూర్తి వివరాలు సేకరించి పోలీస్ వెరిఫికేషన్ చేయించాలని సూచించారు.నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.