25 May, 2026 | 3:31 AM

క్షీరసాగర్‌లో పోలీసుల భారీ కార్డన్ సెర్చ్

25-05-2026 01:52 AM

46 లీటర్ల మద్యం, 20 బైకులు స్వాధీనం

గజ్వేల్, మే 24 : ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు పర్యవేక్షణలో, ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో శనివారం రాత్రి భారీ స్థాయిలో ‘కార్డన్ సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్ర తల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో నలుగురు సీఐలు, 9 మంది ఎస్‌ఐలు సహా మొత్తం 111 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులు 9 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గ్రామంలోని 180 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 20 బైకులను, బెల్ట్‌షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 46 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని సం బంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ నర్సింలు మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులకు పూర్తి వివరాలు లేకుండా ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హె ల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు  ః ఎస్పీ పరితోష్ పంకజ్ 

సంగారెడ్డి, మే 24 : బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లా మీదుగా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల నిర్వహణను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుల్కల్, ఎంఎన్‌ఆర్, కవలంపేట్, ఇంద్రకరణ్, కొండాపూర్, మునిపల్లి చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.

విధుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, వాహనాల తనిఖీలు నిర్వహించే సమయంలో రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించి, లైట్ బ్యాటన్లను వినియోగించాలని సిబ్బందికి ఆదేశించారు. అదేవిధంగా ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రచారం చేసినా, సోషల్ మీడియాలో అసత్య సందేశాలను ఫార్వర్డ్ చేసినా అలాంటి సంఘ విద్రోహ శక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.