ఇం‘ధన’ భారం !
- పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- సామాన్యుడి జేబుకు చిల్లు
- రవాణా రంగంపై తీవ్ర ప్రభావం
కొండాపూర్, మే 24 : ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే గ్యాస్ ధర మండగా తాజాగా పెట్రోల్, డీజిల్ వంతయింది. ఆయిల్ కంపెనీలు లీటరుపై ఏకంగా రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి రావడంతో బంకులకు వెళ్లిన వాహనదారులు షాక్ కు గురయ్యారు. ఈ పెంపుతో జిల్లాపై రోజుకు రూ.8 లక్షల భారం పడనుంది. అలాగే ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై చూపే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
రోజుకు రూ.8 లక్షల భారం..
జిల్లా వ్యాప్తంగా వివిధ ఆయిల్ కంపెనీలకు సంబంధించి 70కి పైగా బంకులు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా రోజుకు 70 వేల నుంచి 80 వేల లీటర్ల పెట్రోల్ వినియోగమవుతుంది. లీటర్ పెట్ప్రో రూ.3 పెంచినప్పటికీ జిల్లాకు వచ్చేసరికి మరో 39 పైసలు అదనంగా పెరిగాయి. ఈ లెక్కన వాహనదారులపై పెట్రోల్ అదనపు భారం రోజుకు సుమారు రూ.3 లక్షల వరకు పడుతుంది.
నెలవారీగా పరిశీలిస్తే రూ.70 లక్షలుపైనే. ఇక డీజిల్ రేటు జిల్లాలో లీటర్కు రూ.3.26 పైసలు పెరగగా... రోజుకు 1.50 లక్షల నుంచి 1.70 లక్షల లీటర్లు వినియోగమవుతుంది. ఈ లెక్కన వాహనదారులపై రూ.4.89 లక్షల భారం పడుతుంది. నెలవారీగా పరిశీలిస్తే అదనపు భారం రూ.1.46కోట్లకు పైనే ఉండనుంది. ఇది రవాణారంగంతో పాటు నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
పేదలపై పెను భారం..
ఇంధన ధరల పెంపుతో వాహనదారులపైనే కాకుండా పాలు, కూరగాయలు, నిత్యావసర సరు కుల ధరలపై ప్రభావం పడే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. రవాణా చార్జీలు సైతం పెరగనున్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారనుంది.
బతుకుడు కష్టమే..
పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యుడి బతుకు భారంగా మారింది. రైతులు తాము పండించిన కూరగాయలను జిల్లా కేంద్రంలోని రైతు బజార్కు తీసుకువెళ్ళడానికి రోజుకు పెట్రోల్ ఖర్చు పెరిగిపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు పెట్రోల్ ధర పెరగడంతో బతుకు భారంగా మారుతుందని వాపోతున్నారు.
లారీ యజమానులకు ఇబ్బందులే..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికిప్పుడు ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెంచే అవకాశం లేదు. కాంట్రాక్టర్లు, వ్యాపారులు పాత ధరకే లారీలను తీసుకెళుతారు. దీంతో వాహన యజమానులకు ఇబ్బందులు తప్పవు.






