22 April, 2026 | 4:33 AM

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

22-04-2026 12:00 AM

కామారెడ్డి, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో పేకాట  స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. మంగళవారం జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి మొత్తం 9 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుండి నగదుతో పాటు మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర,  తెలిపారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని చుక్కాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకొని, వారి వద్ద నుండి రూ. 3,750 నగదు, 4 మొబైల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు, కామారెడ్డి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో  పేకాట స్థావరంపై నిర్వహించిన దాడిలో ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 7,590 నగదు, 5 మొబైల్ ఫోన్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. ఈ రెండు ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయబడ్డాయి.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ: జూదం అనేది కేవలం ఒక ఆట కాదు, అది ఒక వ్యసనం. క్షణికమైన లాభం కోసం ఆశపడి కష్టార్జితాన్ని కోల్పోవడమే కాకుండా, మీపై ఆధారపడిన కుటుంబాలను కష్టాల్లోకి నెట్టవద్దు. పేకాట ఆడుతూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. గౌరవప్రదమైన సమాజంలో జూదానికి చోటు లేదని, అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కితే జైలు శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమ పేకాట, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన పక్షంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగాo ఉంచుతాము అని హామీ ఇచ్చారు.