సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ కొత్త సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్: తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు(Telangana New CS Sanjay Jaju) మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ (MCRHRD) ఇన్‌స్టిట్యూట్, బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మధ్యాహ్నం తర్వాత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు(K. Ramakrishna Rao) తన పొడిగించిన పదవీకాలం పూర్తి చేసుకుని పదవీ విరమణ చేసే జూన్ 30 నుంచి అమల్లోకి వచ్చేలా, జాజును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం లాంఛనంగా ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
రామకృష్ణారావు పదవీ విరమణ అనంతరం, ముఖ్యమంత్రికి సలహాదారుగా, ఎక్స్-అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా(Ex-officio Special Chief Secretary) తెలంగాణ ప్రభుత్వం ఆయనను నియమించింది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజుకు, ఇంతకుముందు రామకృష్ణారావు నిర్వహించిన పరిశ్రమలు , వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయంలోని పరిశ్రమలు అండ్ పెట్టుబడుల విభాగం (Industry & Investment Cell) సీఈఓ, అలాగే 'SPEED' (Smart Proactive, Efficient and Effective Delivery) బాధ్యతలను కూడా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలుగా అప్పగించింది. జాజు ఫిబ్రవరి 2029లో పదవీ విరమణ చేయనున్నారు. మంగళవారం నాడు కేంద్ర సర్వీసుల (డిప్యూటేషన్) నుంచి విముక్తి పొంది తెలంగాణ కేడర్‌కు తిరిగి వచ్చిన జాజు, దాదాపు 13 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు.






