అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు పోలీసులు చెక్
రామగిరి,(విజయక్రాంతి): అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెక్ పెట్టినట్టు, మంథని సర్కిల్ పరిధిలోని రామగిరి పోలీసుల అప్రమత్తతతో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ను పట్టుకున్నామని, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు మంథని సీఐ రాజు వెల్లడించారు. శనివారం రామగిరి పోలీస్ స్టేషన్ లో సిఐ రాజు మాట్లాడుతూ శనివారం ఉదయం పెద్దపల్లి-మంథని రాహదారి కల్వచర్ల శివారులో ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని, వారిని విచారించగా వారు రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు.
అరెస్టయినవారిలో దాసరి రవి (40), వనం పాపయ్య (31), వనం నగేష్ (30) ఉన్నారు. వీరు పగటి వేళ ఇళ్లను గమనించి (రెక్కీ చేసి), రాత్రివేళ తాళాలు పగులగొట్టి బంగారం, నగదు దొంగిలించేవారని సీఐ వివరించారు. కల్వచర్ల, ఓడెడు, ముత్తారం, రత్నపూర్ ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని, నిందితుల వద్ద నుంచి ఒక కారు, టాటా సెప్టిక్ ట్యాంకర్, జూపిటర్ స్కూటీని స్వాధీనం చేసుకున్నామని, ఈ ముఠా కార్యకలాపాలపై మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ప్రజలకు పలు సూచనలు చేశారు.
ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, విలువైన ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచడం, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని పేర్కొన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, ప్రజల సహకారం కీలకమని సీఐ స్పష్టం చేశారు. పథకం ప్రకారం వలపని అంతర్జాతీయ దొంగల ముఠాను పట్టుకున్న ఎస్ఐలు శ్రీనివాస్, రవికుమార్ లను సిబ్బంది దుబాసి రమేష్ తదితరులను సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో రామగిరి ఎస్ఐ ఎస్ఐ శ్రీనివాస్, ముత్తారం ఎస్ఐ రవికుమార్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్ ల్స్ ఉన్నారు.






