17 April, 2026 | 1:41 PM

పెద్దలసభకు హరివంశ్‌ అనుభవం ఎంతో అవసరం

17-04-2026 12:13 PM

న్యూఢిల్లీ: నామినేటెడ్ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్(Harivansh Narayan Singh) శుక్రవారం రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ ను ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అభినందించారు. హరివంశ్ మీద సభకు సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. హరివంశ్ అనుభవాలు రాజ్యసభకు ఎంతో అవసరమని చెప్పారు.

అందిరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని ప్రధాని వెల్లడించారు. హరివంశ్ నేతృత్వంలో సభ మరింత శక్తివంతమవుతోందని, డిప్యూటీ ఛైర్మన్ సమతుల్యంతో సేవలు అందిస్తారని ఆశిస్తున్నట్లు మోదీ స్పష్టం చేశారు. డిప్యూటీ ఛైర్మన్(Deputy Chairman) ఆధ్వర్యంలో సభ ఔన్నత్యం పెంపొందించాలన్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన హరివంశ్ విద్యార్థి దశ నుంచి చురుగ్గా ఉన్నారు, మూడోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారని కొనియాడారు.

మాజీ ప్రధాని చంద్రశేఖర్(Former Prime Minister Chandra Shekhar) జయంతి రోజున బాధ్యతలు చేపడుతున్నారని చెప్పారు. చంద్రశేఖర్ జీవిత విశేషాలతో హరివంశ్ పుస్తకాలు రచించారని తెలిపారు. సభలో హరివంశ్ నుంచిఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని సూచించారు. అధిక సంఖ్యలో యువత ఉన్న దేశం భారత్ అని మోదీ పేర్కొన్నారు. ఎక్కువ సమయం యువకులతో గడిపేందుకు హరివంశ్ ఇష్టపడ్డారని తెలిపారు. యువత సరైన మార్గంలో వెళ్లేందుకు తనదైన కృషి చేశారని చెప్పారు. సామాజిక చైతన్యం తీసుకురావడానికి నిరంతరం శ్రమించారని పేర్కొన్నారు. హరివంశ్.. కళాశాలలు, యూనివర్సిటీల్లో 350 కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కళాశాలలు, యూనివర్సిటీల్లో కార్యక్రమాల ద్వారా ఆదర్శంగా నిలిచారని ప్రధాని ప్రశంసించారు.