27 July, 2026 | 3:15 AM

బకాయిలు చెల్లించండి మహాప్రభో

27-07-2026 02:28 AM
  1. లబోదిబోమంటున్న రైస్ మిల్లర్లు
  2. పుష్కర కాలంగా పేరుకుపోయిన వేలకోట్లు!
  3. మిల్లింగ్, రవాణా, డ్రైయేజ్, కస్టోడియన్ చార్జీలు పెండింగ్
  4. పట్టించుకోని పౌరసరఫరాల శాఖ, ప్రభుత్వం
  5. ఆందోళనలో రైస్ మిల్లర్లు
  6. ఇప్పటికైనా చెల్లించాలని సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ఒకటి, రెండు కాదు.. ఏకంగా పుష్కర కాలం.. అంటే పన్నెండు సంవత్సరాలు.. ఒకటా.. రెం డా.. రూ. వేల కోట్లు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇవి. ధాన్యం మిల్లింగ్ చేసినందుకు, అలాగే బియ్యాన్ని రవాణా చేసినందుకు, అలాగే డ్రైయేజ్ ఛార్జీలు, కస్టోడియన్ ఛార్జీలు ఇవన్నీ కలుపుకుంటే గడిచిన పన్నెండేండ్ల కాలంలో రాష్ట్రంలోని రైస్ మిల్లర్లందరికీ ప్రభుత్వం (పౌర సరఫరాల విభాగం) వేల కోట్లు బకాయి పడిందని రైస్ మిల్లర్ల సంఘం లబోదిబోమంటోంది. మహాప్రభో మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా పౌరసరఫరాల విభాగానికి, ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లయినా లేకపోవడం గమనార్హం. 

మిల్లింగ్ ఛార్జీలు..

ప్రతియేటా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు సరఫరా చేస్తారు. ఈ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు మిల్లింగ్ చేసి అటు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), పౌర సరఫరాల (సివిల్ సప్లు) విభాగాలకు బియ్యాన్ని సరఫరా చేస్తారు. ఇలా మిల్లింగ్ చేయడానికి ఒక్కో క్వింటాలు ధాన్యానికి రూ. 50 చొప్పున మిల్లింగ్ ఛార్జీల రూపంలో చెల్లిస్తారు. అయితే ఎఫ్‌సీఐ మాత్రం కాస్త ముందో వెనకో ఈ ఛార్జీలను చెల్లిస్తుంది. కానీ సివిల్ సప్లు విభాగం మాత్రం గడిచిన పుష్కర కాలంగా ఒక్క పైసాకూడా చెల్లించలేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సగటున ఒక్కో సంవత్సరం కనీసం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సివిల్ సప్లుకి బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే.. ప్రతియేటా సుమారు రూ. 250 కోట్ల వరకు మిల్లింగ్ ఛార్జీల రూపంలోనే బకాయిలు ఉన్నాయంటున్నారు. అంటే గడిచిన పన్నెండు సంవత్సరాలుగా సుమారు రూ. 3000 కోట్లు మిల్లింగ్ ఛార్జీల రూపంలోనే మిల్లర్లకు బకాయిలు ఉన్నట్టుగా సమాచారం. ఇక ఎఫ్‌సీఐ కూడా గడిచిన మూడేండ్లుగా మిల్లింగ్ ఛార్జీలు పెండింగ్‌లోనే ఉంచుతోంది. ఈ మూడేండ్లలో సుమారు రూ. 650 నుంచి రూ. 750 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయినట్టుగా మిల్లర్లు చెబుతున్నారు.

రవాణా ఛార్జీలు..

ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన తరువాత బియ్యా న్ని అటు ఎఫ్‌సీఐకి, ఇటు పౌర సరఫరాల శాఖకు రవాణా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు, మిల్లర్లతో పౌర సరఫరాల శాఖకు ఉండే ఒప్పందాన్ని బట్టి.. రైస్ మిల్లు నుంచి 8 కి.మీ దూరం వరకు సివిల్ సప్లు గోదాములకు బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తారు. 8 కి.మీ కన్నా ఎక్కువ దూరం సరఫరా చేస్తే కిలోమీటరుకు క్వింటాలుకు రూ. 5.80 పైసల చొప్పున రవాణా ఛార్జీలు (ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం) చెల్లించాల్సి ఉంటుంది.

ప్రతి సంవత్సరం పౌర సరఫరాల శాఖ నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి అధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు సమీపంలోని గోదాములకు బియ్యాన్ని లారీల్లో సరఫరా చేస్తారు.అయితే 8 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న గోదాములకు దాదాపు 50 శాతం వరకు బియ్యాన్ని సరఫరా చేస్తారని మిల్లర్లు అంటున్నారు. ఈ లెక్కన ప్రతియేటా సుమారు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయగా వచ్చే 67 శాతం బియ్యాన్ని 8 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న గోదాములకు సరఫరా చేస్తున్నారు. అంటే ఒక కిలోమీటరుకు క్వింటాలుకు రూ. 5.80 పైసల చొప్పున తీసుకున్నా వందల కోట్ల రూపాయలు రైస్ మిల్లర్లకు పౌరసరఫరాల శాఖ బకాయి ఉన్నట్టే. దీనిపై ప్రభుత్వంలో ఏమాత్రం కదలిక లేకపోవడం గమనార్హం.

కస్టోడియన్ ఛార్జీలు..

ధాన్యం వచ్చిన తరువాత మిల్లరు మిల్లింగ్ చేసి బియ్యాన్ని సరఫరా చేయాలి. ఇదంతా 3 నెలల్లో పూర్తి కావాలి. కానీ అంతకంటే ఎక్కువ సమయం (ప్రభుత్వం నుంచి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయితే) గడిస్తే నెలకు క్వింటాలుకు కొంత మొత్తాన్ని కస్టోడియన్ ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. గడువు ముగిసిన తరువాత కూడా బియ్యాన్ని సంరక్షించి గోదాముల్లో స్థలం లభించడాన్ని బట్టి సరఫరా చేస్తున్నందుకు.. ఈ కస్టోడియన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదికూడా ప్రతియేటా రూ. వందల కోట్లలో ఉంటుంది. 

రికార్డుల ప్రకారం చూసుకుంటే మిల్లర్ల వద్ద ఐదారు సంవత్సరాల క్రితం నాటి ధాన్యం కూడా పెండింగ్‌లో ఉంది. కొన్నిసార్లు మిల్లర్ల తప్పిదం అయితే, మరికొన్నిసార్లు గోదాముల్లో స్థలం లేకపోవడం కారణంగా బియ్యం సరఫరా నిలిచిపోతోంది. అందుకే రికార్డుల్లో ఐదారు సంవత్సరాల క్రితం ధాన్యానికి సంబంధించిన బియ్యం కూడా ఇంకా సరఫరా చేయలేదనే సమాచారం ఉంటుంది. ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే సమస్యల కారణంగా నిల్వ చేసిన ధాన్యం/ బియ్యానికి కస్టోడియన్ ఛార్జీలను సుమారు పుష్కర కాలం నుంచి చెల్లించడం లేదని మిల్లర్లు అంటున్నారు. 

ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యాన్ని సరఫరా చేసే క్రమంలో మిల్లర్లకు రావాల్సిన వివిధ ఛార్జీల మొత్తాన్ని ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోవట్లేదని మిల్లర్లు వాపోతున్నారు. వేల కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోతున్నా, అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు పౌరసరఫరాల శాఖ నుంచి గానీ ఎలాంటి స్పందన రావడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా ఈ ఛార్జీలను విడుదల చేయాలని కూడా ప్రభుత్వానికి మిల్లర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. ఇక పేరుకుపోయిన బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారా? అని మిల్లర్లకు ఎదురుచూపులు తప్పడం లేదు.

ఒక శాతం డ్రైయేజ్ ఛార్జెస్..

ప్రతియేటా ధాన్యం మిల్లింగ్‌కు వచ్చిన తరువాత.. కనీసం మూడు నెలల్లోగా ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని సరఫరా చేయాలి. అయితే ఈలోగా.. ధాన్యంలో ఉండే తేమ శాతం పూర్తిగా అడుగంటుతుంది. ధాన్యం తూకంలో తేడా వస్తుంది. ఈ తేడా బియ్యం సరఫరాపై పడకుండా ఉండేందుకు ఒక్కో క్వింటాలుకు ఒక శాతం చొప్పున డ్రైయేజ్ ఛార్జీలను సివిల్ సప్లు శాఖ చెల్లించాల్సి ఉంటుంది. ఒక క్వింటాలు ధాన్యం రూ. 23.50 చొప్పున అనుకున్నా, ఒక కిలో ధాన్యం రూ. 23.50 పైసలు అవుతుంది.

అంటే.. ఒక టన్నుకు రూ. 235 డ్రైయేజ్ ఛార్జీలుగా చెల్లించాలి. ఈ లెక్కన లక్ష టన్నుల ధాన్యంలో ఒక శాతం అంటే 1000 టన్నుల విలువ రూ. 23,5000 చొప్పున ఛార్జీలు కట్టి ఇవ్వాల్సి ఉంది. ఇవికూడా గడిచిన 12 సంవత్సరాలుగా మిల్లర్లకు అందడం లేదు. ఒక్కో సంవత్సరం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అనుకుంటే అందులో ఒక శాతం డ్రైయేజ్ ఛార్జీల రూపంలో యేటా రూ. 1.17 కోట్ల చొప్పున బకాయిలు ఉన్నాయి.