31 May, 2026 | 1:20 AM

గైడ్‌లైన్స్ ఏవీ?

31-05-2026 01:11 AM
  1. రేపోమాపో ఉద్యోగుల హెల్త్‌కార్డుల జారీకి సర్కారు సిద్ధం! 
  2. పూర్తికాని ఎన్‌రోల్‌మెంట్

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ప్రభుత్వం ఉన్నపళంగా ఉద్యోగుల న్యూ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్)ను అమలుచేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలు స్తోంది. అందుకే ఇప్పటివరకు దీనికి సం బంధించిన ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ స్కీం అమలు, ఉద్యోగుల వివరాల అప్‌లోడ్ చేయడంలో అనేక సమస్యలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వీటికి సంబంధించిన వివరాలు ఎవరిని అడగాలి? కుటుంబంలోని ఎవరి పేర్లు నమోదుచేయాలి? కుటుంబంలో  ఇద్దరు ఉద్యోగులుంటే అప్పుడెలా? లాంటి అనేకరకమైన సందేహాలు వారిలో ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఉద్యోగులు ఏం చేయాలో తెలియక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు.

ఆయా నేతలకు కూడా అంతంత మాత్రంగానే స్కీం గురించి ఐఎఫ్‌ఎంఐఎస్ నమోదు ప్రక్రియ గురించి చెబుతుం డటంతో కింది స్థాయి ఉద్యోగులకు ఏం చెయాలో పాలుపోవడంలేదు. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తేగాని ఈ సమస్య పరిష్కారం కాదని ఉద్యో గ సంఘాల నాయకులు అంటున్నారు.

రెండూ వేర్వేరు అంటున్న పరిస్థితి..

ఇదిలా ఉంటే, ప్రభుత్వం ఈనెల 31లోపు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వారి డిపెండెంట్స్ వివరాలను ఐఎఫ్‌ఎంఐఎస్-హెచ్‌ఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఇదంతా ఈహెచ్‌ఎస్ అమలుకోసమే ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుందనే చర్చ నిన్నటి వరకు జరిగింది. దీంతో ఉద్యోగులు కూడా తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు.

కానీ, ఈహెచ్‌ఎస్, ఐఎఫ్ ఎంఐఎస్‌లో వివరాల నమోదు అంశం లో రకరకాల సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో అసలు ఈహెచ్‌ఎస్‌కు, పోర్టల్‌లో వివరాల నమోదుకు ఎలాంటి సంబంధంలేదని అధికా రికవర్గాలు పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చెప్తున్నట్లుగా తెలిసింది. రాష్ట్రంలో దాదాపు 3.60 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో ఉపాధ్యాయులు సుమారు 1.20 లక్షల మంది వరకు ఉంటారు.

అయితే ఇప్పటివరకు చాలా తక్కువ మంది మాత్రమే ఐఎఫ్‌ఎంఐఎస్‌లో తమ వివరాలు నమోదుచేసుకున్నట్లుగా సమాచారం. భర్త, భార్య ఇద్దరూ ఉద్యో గులయితే.. వీరిలో ఎవరి పేరు నమోదు చేసుకోవా లి? ఎవరి మూల వేతనం నుంచి 1.5 శాతం నిధులు హెల్త్ ట్రస్ట్‌లో జమవుతాయనే ప్రశ్నలను ఉపాధ్యాయులు, ఉద్యోగులు లేవనెత్తున్నారు.

అలాగే మహిళా ఉద్యోగి అయితే కేవలం తల్లిదండ్రుల పేర్లనే నమోదు చేసుకోవాలా? లేకుంటే వారి అత్తమామ ల పేర్లను నమోదు చేసుకోవాలా?, క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్, దాని పరిమితిఎంత? చాలా రకాల అంశాల పై స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు. మరోవైపు ఉద్యోగుల వివరాల నమోదుకు గడువుపెంచాలని కోరారు.

రేపో ఎల్లుండో శ్రీకారం చుట్టి..

ఈనెల 2న సీఎం రేవంత్‌రెడ్డితో ఉద్యోగుల జేఏసీ నేతల సమావేశం జరిగినప్పుడు అందులో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌కు జూన్ 1లోగా హెల్త్ కార్డులను అందిస్తామన్నారు. ఉద్యోగుల వివరాల నమో దు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో జూన్ 1న లేదా 2న ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీచేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, తర్వాత అంటే జూన్ 12న దానిని పూర్తి స్థాయిలో అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు.