క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
దామరచర్ల, సెప్టెంబర్ 2: క్రీడలు ఆడటం వలన శారీరక, మానసిక దృఢత్వం పెంపొందిస్తాయని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Bathula Laxma Reddy) అన్నారు. మండల కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను బుధవారం ప్రారంభిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.
క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు.క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి మండలానికి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొంత సమయం క్రీడా పోటీలను తిలకిస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆటలు ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సైదానాయక్ ,పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ లిమామేరీ, దామరచర్ల సర్పంచ్ రేణుక సిరి, మాజీ సర్పంచ్ కిరణ్, గాజుల శ్రీనివాస్, నాగు నాయక్, స్కైలాబ్ నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






