30 June, 2026 | 2:42 AM

హీటెక్కిన పేట రాజకీయం

30-06-2026 01:49 AM

కాక రేపిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు

సూర్యాపేట రూరల్, జూన్ 29: సూర్యాపేట మండలం రత్నాపురం వద్ద సోమవారం మూసి ప్రాజెక్టు ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేసే అధికారిక కార్యక్రమం కాస్తా ఒక్కసారిగా పొలిటికల్ హీట్ కు వేదికగా మారింది. నీటి విడుదలకు గేట్లు ఎత్తిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అదే వేదికపై నుంచి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

సాగునీటి విడుదల వేదికను కాస్తా రాబోయే ఎన్నికల శంఖారావంగా మార్చేస్తూ ఆయన చేసిన ’బుల్లెట్’ కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాల్లోనూ తీవ్ర కలకలం రేపాయి. రత్నాపురం వద్ద ఎడమ కాలువ గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేసిన అనంతరం వీరేశం మీడియా, ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో కాంగ్రెస్ ఓటమిని ప్రస్తావిస్తూ మన దామన్న తనయుడు సర్వోత్తమ్ రెడ్డి ఇంత చురుకుగా ఉండి ఉంటే సూర్యాపేట సీటు మిస్ అయ్యేదే కాదన్నారు. రాబోయే రోజుల్లో మాత్రం ఇక్కడ బుల్లెట్ దిగడం ఖాయం ఇకపై సూర్యాపేట మిస్సయ్యే ప్రసక్తే లేదంటూ సంచలన ప్రకటన చేశారు. ఒక సాగునీటి విడుదల కార్యక్రమంలో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే సూర్యాపేట అభ్యర్థిత్వంపై ఇంత ఓపెన్గా ‘బుల్లెట్ దిగుద్ది’ అంటూ వ్యాఖ్యానించడం స్థానిక రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టించాయి.

అలాగే మంత్రుల సపోర్ట్ గురించిన విషయాలను కూడా వీరేశం బహిరంగంగానే బయటపెడుతూ సర్వోత్తమ్ రెడ్డికి ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండదండలు మెండుగా ఉన్నాయని స్పష్టం చేశారు. మంత్రుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని చెబుతూ అవినీతి రహిత పాలన కోసం వస్తున్న సర్వోత్తమ్ రెడ్డికి ప్రజలంతా అండగా నిలబడాలన్నారు. తాను కూడా నకిరేకల్ నియోజకవర్గం నుంచి 100 శాతం సహకారం అందిస్తామని తేల్చిచెప్పడం సొంత పార్టీలోనే తీవ్ర కాకరేపుతోంది.

పార్టీ అధిష్ఠానం కంటే ముందే ఒక అభ్యర్థి పేరును ప్రొజెక్ట్ చేస్తూ వీరేశం మాట్లాడటంపై సూర్యాపేట జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తుండగా స్థానిక సీనియర్ కాంగ్రెస్ నేతలను కాదని వేముల వీరేశం ఇక్కడికి వచ్చి రూట్ మ్యాప్ డిసైడ్ చేయడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మూసి నీటి కంటే వేముల వీరేశం నోటి నుంచి వచ్చిన పొలిటికల్ కామెంట్స్ సూర్యాపేటలో పార్టీ నాయకుల మధ్య పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.