గరిడేపల్లిలో డీజేలకు అనుమతి లేదు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్
గరిడేపల్లి, జూలై 21 : గరిడేపల్లి మండలంలోని డీజీలకు ఎలాంటి అనుమతులు లేవని గరిడేపల్లి ఎస్‌ఐ బి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ శుభకార్యాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, పండుగల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్ల వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి డీజేలు నిర్వహిస్తే సంబంధిత యజమానులు, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మండలంలోని డీజే యజమానులను ఇప్పటికే పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. చట్టాన్ని గౌరవిస్తూ పోలీసు శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని వారికి అవగాహన కల్పించామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే అవకాశం ఉన్న నేపథ్యంలో డీజే యజమానులను బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. మైక్ వినియోగానికి సంబంధించి చట్టబద్ధమైన అనుమతి తప్పనిసరిగా పోలీసు శాఖ నుంచి తీసుకోవాలని ఎస్త్స్ర స్పష్టం చేశారు.
డీజే సౌండ్ సిస్టమ్లకు ఎలాంటి అనుమతులు లేవని, శుభకార్యాలు, వివాహ వేడుకలు, ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాలు, రాజకీయ బహిరంగ సభలు, ఇతర వేడుకలలో డీజేలు వినియోగించరాదని ఆయన పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం వల్ల విద్యార్థులు, వృద్ధులు, చిన్నారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
చట్టం అందరికీ సమానమేనని ఎవరైనా నిబంధనలు అతిక్రమించి డీజేలు నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






