ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోందన్నారు. వివిధ శాఖల అధికారులు తమ తమ విభాగాల పరిధిలో చేపట్టిన పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారని చెప్పారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పంచాయతీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందించామన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు కూడా విజయవంతంగా సాగాయని పేర్కొన్నారు. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం అన్ని కార్యక్రమాలను సమయానికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇప్పటివరకు నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొనడం సంతోషకరమని, రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ విష్ణు వర్ధన్, డీపీఓ శ్రీనివాస్, ఆర్టిఓ ర్గాప్రసాద్, వైద్య శాఖ అధికారి సౌమ్య, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






